- ఇందుకోసం కన్సల్టెన్సీలకు యాజమాన్యం పిలుపు
 - మైనింగేతర రంగాల్లో పలువురు మైనింగ్ ఉన్నతాధికారులు
 - సింగరేణిలో మెడికల్ బోర్డుకు మంగళం పాడినట్టేనా..
 - కంపెనీలో మరోసారి సీఆర్ఎస్ అమల్లోకి వచ్చేనా?
 
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో మ్యాన్పవర్పై స్టడీకి యాజమాన్యం కన్సల్టెన్సీల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి కలిగిన కన్సల్టెన్సీలు ఈనెల 10లోపు సింగరేణి సంస్థ చూపిన ఫార్మాట్లో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సింగరేణిలో వేల సంఖ్యలో సర్‌ప్లస్‌లో కార్మికులు ఉన్నారని ఇటీవల పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సర్ప్లస్ నేపథ్యంలో మెడికల్బోర్డును కూడా యాజమాన్యం గత కొద్ది నెలలుగా నిర్వహించడం లేదు.
మరోవైపు మైనింగ్‌కు చెందిన ఉన్నతాధికారులు మైనింగేతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సర్ప్లస్కార్మికులతోపాటు ఏఏ విభాగాల్లో ఎవరు పనిచేస్తున్నారనే విషయమై తెలుసుకునేందుకు మ్యాన్‌పవర్ స్టడీ చేయించడం ఆసక్తిగా కలిగిస్తోంది.
మ్యాన్ పవర్పై స్టడీ..
సింగరేణి కంపెనీలో దాదాపు 42 వేల మందికి పైగా రెగ్యులర్ఉద్యోగులు(కార్మికులు), ఆఫీసర్లు పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాల కిందట లక్ష వరకు కార్మికులుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 42 వేలకు తగ్గింది.మైన్స్ ఒక్కొక్కటిగా మూత పడ్తుండడం, కొత్త మైన్స్ రాకపోవడంతో కార్మికులను సర్దిబాటు చేయడం కంపెనీకి తలకు మించిన భారంగా మారింది. కంపెనీలో దాదాపు ఏడు వేల నుంచి పది వేల మంది వరకు ఉద్యోగులు సర్ ప్లస్‌లో ఉన్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మైనింగేతర రంగాల్లో మైనింగ్డిపార్ట్మెంట్కు చెందిన ముఖ్యఅధికారులు విధులు నిర్వహిస్తున్నట్టుగా యాజమాన్యం గుర్తించింది. మైనింగ్ఆఫీసర్లు మైనింగేతర రంగాల్లో పనిచేయడం మూలంగా అటు బొగ్గు ఉత్పత్తిలో ఇటు మైనింగేతర రంగాల్లోనూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడినట్టుగా యాజమాన్యం గుర్తించింది.
కంపెనీలో సీఆర్ఎస్ టెన్షన్..
మ్యాన్ పవర్ స్టడీపై కార్మికుల్లో సీఆర్ఎస్ టెన్షన్ నెలకొంది. గతంలో కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్), వాలంటరీ రిటైర్ మెంట్స్కీం(వీఆర్ఎస్) గోల్డెన్ షేక్ హ్యాండ్ పేర పలు స్కీంలను యాజమాన్యం అమలు చేసింది. ఈ క్రమంలోనే మ్యాన్‌పవర్ స్టడీకి ఆసక్తి గల కన్సల్టెన్సీ సంస్థలను టెండర్లు పిలువడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
కొత్త మైన్స్తోనే భవిష్యత్..
సింగరేణిలో కొత్త మైన్స్ వస్తేనే కార్మికులకు భవిష్యత్ ఉంటుందని యూనియన్ల లీడర్లు పేర్కొంటున్నారు. కొత్త మైన్స్ తీసుకొచ్చి కార్మికులను సర్దుబాటు చేయడంతోపాటు మెడికల్బోర్డును నిర్వహించేందుకు యాజమాన్యంతోపాటు ప్రభుత్వం చొరవ చూపాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.
సర్ ప్లస్ పేర మెడికల్‌బోర్డుకు మంగళం పాడినట్టేనా..
సింగరేణిలో కార్మికులకు వరప్రదాయిని మెడికల్‌బోర్డు. మెడికల్‌బోర్డు ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తమ వారసులకు ఇన్వాలిడేషన్ పేర సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కంపెనీ ఒక మంచి సదుద్దేశంతో ఈ స్కీంను అమలు చేస్తున్నప్పటికీ కొందరు ఆఫీసర్లు, దళారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మెడికల్‌బోర్డులో కార్మికులు అన్ఫిట్కావాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అక్రమ వసూళ్లు చేపట్టారు.
ఈ దందాను అరికట్టేందుకు గతంలో యాజమాన్యం ఏసీబీకి లేఖ రాసింది. అయినప్పటికీ దందా పెద్దగా ఆగలేదు. ఇదే టైంలో సర్ప్లస్ విషయం కంపెనీలో చర్చ మొదలైంది. ఇప్పటికే కంపెనీలో ఐఈడీ లెక్కల ప్రకారంగా అవసరానికి మించి ఎక్కువ మంది కార్మికులున్నట్టు సీఎండీ గతంలో పేర్కొన్న దాఖలాలున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడెనిమిది నెలలుగా మెడికల్ బోర్డును యాజమాన్యం నిలిపివేసింది. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో ఇక భవిష్యత్‌లో మెడికల్ బోర్డు మిథ్యేనా అనే చర్చ కార్మికుల్లో కొనసాగుతోంది.
