తెలంగాణలో స్లోగా వ్యాక్సినేషన్

V6 Velugu Posted on Jul 12, 2021

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందులోనూ 30 నుంచి 50 వేల డోసులు ప్రైవేటు సెంటర్లలోనే వేస్తున్నారు. ఇక గవర్నమెంట్‌లో వేసేది రోజుకు లక్ష మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు, బుధవారం, ఆదివారం పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిపివేశారు. ఇట్లైతే ఇంకో ఏడాదైనా రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందే అవకాశం లేదు. రాష్ట్రంలో 2.64 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ 19,87,117 మందికి మాత్రమే రెండు డోసులు వేశారు. మరో 84,35,048 మందికి సింగిల్ డోసు వేశారు. ఇంకో 1,60,42,705 మందికి ఫస్ట్ డోసు కూడా అందలేదు. ఇప్పుడు వేస్తున్నట్టుగా.. వారానికి 7 లక్షల మందికి వేస్తే, వ్యాక్సినేషన్ పూర్తవడానికి కనీసం ఇంకో ఏడాదైనా పడుతుంది.
రెండు డోసులతోనే అడ్డుకోగలం!
రాష్ట్రంలో సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌పైనే సర్కార్ దృష్టి పెట్టింది. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో సెకండ్ డోసు గడువును 84 రోజుల నుంచి 98 రోజులకు పెంచింది. అయితే, ఇప్పుడు విజృంభిస్తున్న డెల్టా ప్లస్, ల్యామ్డా వంటి వేరియంట్లను అడ్డుకోవాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ అవసరమని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. సింగిల్‌ డోసుతో పది నుంచి 20 శాతం రక్షణ ఉంటే, రెండు డోసులతో 95 శాతం వరకూ రక్షణ ఉంటుందని ఫ్రాన్స్ సైంటిస్టులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో మన దగ్గర రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే రెండు నెలల్లోనే సుమారు 70 లక్షల మంది సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉంది. వీళ్లందరికీ వ్యాక్సిన్ వేయాలంటే, ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ చాలా తక్కువగా చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు, ఇప్పటికే థర్డ్ వేవ్‌ సూచనలు మొదలయ్యాయి. కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్ల కేసులు పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా 9 జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గలేదని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
రోజుకు వంద మందికే టీకా
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కోసం జనాలు ఇప్పటికీ పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో మండలంలోని పీహెచ్‌సీలో రోజూ వంద మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం వచ్చిన చాలా మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు. డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ తీసుకుందామన్నా దొరకడం లేదు. ఇలా తిరిగి, తిరిగి విసిగిపోయి వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్న ఆలోచనను జనాలు విరమించుకుంటున్నారు. గ్రామాల్లో క్యాంపులు పెట్టి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినప్పటికీ, ఆ కార్యక్రమం అమలు కావట్లేదు. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వాళ్లకు వ్యాక్సిన్ వేయాలంటే గ్రామాల్లో క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంది.

Tagged Telangana, corona, Vaccination, , Slow

Latest Videos

Subscribe Now

More News