
హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పట్టుకునే ప్రక్రియలో ఆసిఫ్ చాలా గొప్ప సాహసం చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు. కాగా, కరుడుగట్టిన నిందితుడు రియాజ్‌ను పట్టుకునే ప్రక్రియలో ఆసిఫ్ అనే యువకుడు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో అబిడ్స్‌లోని గ్రీన్ ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్‌ను డీజీపీ శివధర్ రెడ్డి, శాంతిభద్రతలు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. రియాజ్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఆసిఫ్ చేతికి డాక్టర్లు ఆపరేషన్ చేసి మళ్లీ చేతిని ఒరిజినల్ షేప్‌కు తీసుకొచ్చారని చెప్పారు. ఆసిఫ్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందన్నారు. అసిఫ్ చాలా గొప్ప సాహసం చేశాడని.. క్రిమినల్ చేతిలో కత్తి ఉన్నప్పటికీ భయపడకుండా ధైర్యంగా అతడిని పట్టుకున్నాడని ప్రశంసించారు.
ఆసిఫ్ తన ప్రాణాలకు తెగించి రియాజ్‌ను పట్టుకున్నాడని.. అతడి సహకారంతోనే కేసును ఛేదించగలిగామని అన్నారు. నేరస్తుడు రియాజ్‌ను పట్టుకోవడంలో సహకరించిన ఆసిఫ్‌కు రూ.50 వేల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆసిఫ్‌కు మేము చేయవలసిన సాయం చేస్తున్నామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఆసిఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడని.. అతడు కోలుకోవడానికి రెండు, మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.