
న్యూఢిల్లీ: ఆప్ఘాన్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఇండియానే కారణమని పాకిస్తాన్ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆరోపణలపై ఆప్ఘాన్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాక్, ఆప్ఘాన్ ఉద్రిక్తతల వెనక ఇండియా ఉందని పాకిస్తాన్ చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. పాక్ చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవి, ఆమోదయోగ్యం కానివి అని తోసిపుచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగాన్ని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో సహా పొరుగు దేశాలన్నింటితో శాంతియుత, సహకార సంబంధాలను కొనసాగించడానికి ఆఫ్ఘనిస్తాన్ కట్టుబడి ఉందని తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆఫ్గానిస్తాన్ తన విదేశీ సంబంధాలను స్వతంత్రంగా నిర్వహిస్తుందని.. జాతీయ ప్రయోజనాల ఆధారంగా భారత్తో సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటుందని పేర్కొన్నారు.
►ALSO READ | వామ్మో.. లాహోర్లో జనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి: ఇండియానే కారణమంటూ పాక్ అభాండాలు..!
తాలిబన్ ప్రభుత్వం ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటుందని, సంఘర్షణను కాదని అన్నారు. ఇతర దేశాలపై నిందలు వేయడం కంటే చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని పాక్కు చురకలంటించారు. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడవని హితవు పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఎవరైనా దాడి చేస్తే ప్రజలు ధైర్యంగా తమ దేశాన్ని రక్షించుకుంటారని.. తన మాతృభూమిని రక్షించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ దృఢంగా నిలబడిన చరిత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.