
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీరు ఎప్పుడూ వింతగా ఉంటుంది. వాళ్ల తప్పులు, అసమర్థత, వైఫల్యాలను ఒప్పుకోవడం ఆ దేశ నేతలకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ దేశంలో చీమ చిటుక్కుమన్నా ఇండియానే కారణమంటూ ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతుంటారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా వాళ్లు వాళ్ల తప్పులను గుర్తించి సరి చేసుకుని ప్రయత్నం చేయకుండా.. ఆ దేశంలో జరిగే ప్రతి తప్పుకు ఇండియానే కారణమంటూ అభాండాలు మోపుతుంటారు.
తాజాగా కూడా ఇలాంటి ఘటనే కూడా ఒకటి చోటు చేసుకుంది. పాకిస్తాన్లో ప్రముఖ నగరమైన లాహోర్‌లో గాలి నాణ్యత బాగా క్షీణించింది. పొల్యూటెడ్ ఎయిర్ లాహోర్ నగరాన్ని కమ్మేయడంతో జనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే.. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టకుండా ఈ పరిస్థితికి కారణం ఇండియానే అని ఆరోపిస్తోంది పాక్. లాహోర్‌లో గాలి నాణ్యత క్షీణించడానికి ఇండియాలో దీపావళికి లింక్ పెట్టారు ఆ దేశ నేతలు.
పాకిస్తాన్ దినపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో దీపావళి సందర్భంగా కాల్చే బాణసంచా నుంచి వెలువడే ఉద్గారాలు లాహోర్‌లో గాలి నాణ్యత క్షీణించడానికి కారణమని ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణ విభాగం ఆరోపించింది. అదే విధంగా న్యూఢిల్లీ, ఉత్తర భారత నగరాల నుంచి వచ్చే కాలుష్య కారకాలు లాహోర్‌లో పరిస్థితిని మరింత దిగజార్చాయని స్థానికలు అధికారులు పేర్కొన్నట్లు డాన్ పత్రిక నివేదించింది.
పాక్ వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి చర్యలు చేపట్టకుండా.. ఇండియాపై అభాండాలు మోపడంతో ఆ దేశ తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో మరియం నవాజ్ నేతృత్వంలోని లాహోర్ ప్రభుత్వం అప్రమత్తమై వాయు కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు చేపట్టింది.
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో లాహోర్
లాహోర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మంగళవారం (అక్టోబర్ 21) ఉదయం నాటికి 266కి చేరినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. లాహోర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. -భారత రాజధాని ఢిల్లీ తర్వాత అత్యంత కలుషిత నగరాల జాబితాలో లాహోర్ రెండో ప్లేస్‌లో ఉంది. అయితే, లాహోర్‌లో గాలి కాలుష్యం పెరగడం కొత్తేమీ కాదని పర్యావరణ నిపుణులు పేర్కొన్నారు.
విపరీతంగా పంటలను తగలబెట్టడం, అదుపు లేకుండా వాహనాల ఉద్గారాలు, పారిశ్రామిక పొగ కారణంగా లాహోర్ ప్రపంచంలోని అత్యంత కలుషితమైన పట్టణ కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ పాకిస్తాన్ తన సొంత పర్యావరణ నిర్లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించడంలో భాగంగా ఇండియాపై తప్పు నెడుతూ బ్లేమ్ గేమ్ ఆడుతోంది.