
- భూ భారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు
- సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- కొత్త లైసెన్స్‌డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లు..
- గతంలో సర్వే కోసం 2, 3 నెలలకుపైనే వెయిటింగ్
- కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్
- రెండెకరాల్లోపు విస్తీర్ణం సర్వే, మ్యాప్‌కు రూ.వెయ్యి ఫీజు
- ప్రతిపాదనలు సిద్ధం.. - త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: భూమి సర్వే, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో నెలకొన్న జాప్యం, గెట్ల పంచాయితీలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘భూ భారతి’ చట్టం ప్రకారం ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడంతో.. దానిని అమల్లోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్నది. ఇక సర్వే కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లించడంలాంటి పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందుకోసం కొత్తగా నియమించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లను అందజేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే, సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. త్వరలో ఈ కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం ప్రకటించనున్నది.
గెట్ల పంచాయితీలకు ఇక చెక్
భూమి సర్వే ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నది. రైతులు తమ భూమి సర్వే కోసం దరఖాస్తులు, అవసరమైన ఫీజుల చెల్లింపులు ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లోనే పూర్తి చేయొచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు స్టేటస్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక లాగిన్లను కూడా అందజేయనున్నది. సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్ డ్ సర్వేయర్ల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం విడతలవారీగా జమ చేయనున్నది
ప్రతి మండలానికి 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు
గతంలో భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల రెండు, మూడు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇపుడు ప్రతి మండలానికి 4-6 మంది లైసెన్స్‌డ్ సర్వే యర్లు అందుబాటులో ఉంటారు. మరికొంత మందికి శిక్షణ కొనసాగుతున్నది. పరీక్ష పాస్ అయితే మరో 3 వేల మంది డిసెంబర్‌లో అందుబాటులోకి వస్తార ని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ కొత్త విధానం లో సర్వే మ్యాప్ జాప్యాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్య లు చేపట్టింది.
సర్వే ఫీజులను కూడా ప్రతిపాదించింది. ముఖ్యంగా, రెండెకరాలలోపు విస్తీర్ణానికి సర్వే చేసి, మ్యాప్ అందించడానికి వెయ్యి ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు ఎకరా ప్రాతిపదికన లేదా స్లాబులవారీగా ఫీజులు ఉండే అవకాశం ఉన్నది. 2-5 ఎకరాల వరకు 2 వేలు, 5-10 ఎకరాల వరకు5 వేలు, విస్తీర్ణం 10 ఎకరాలు మించితే 5 వేలకు అదనంగా ప్రతి ఎకరాకు రూ.500 చొప్పున ఫీజు ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ఫీజుల వివరాలతోసహా పూర్తి నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నది. ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే, భూమి రికార్డుల్లో పారదర్శకత పెరిగి, సరిహద్దుల వివాదాలు (గెట్ల పంచాయితీలు) తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
కొత్త సర్వేయర్లతో పనులు స్పీడప్
రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నంబర్లు , బై నంబర్లు , సరిహద్దులు , ఫీల్డ్‌లో సాగు విస్తీర్ణంలాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయి. భూమికి సంబంధించిన వివాదాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం మూలకారణంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘భూ భారతి’ చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జతచేయాలనే నిబంధన తెచ్చింది.
దీంతో సర్వేయర్ల అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్‌మెంట్‌లో 612 మండలాలకు కేవలం 350 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే 3,456 కొత్త లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించింది. వీరికి ఇప్పటికే నియామక పత్రాలను అందజేసింది.