Pragathi Shetty: బెంగళూరు నుంచి మకాం మార్చాం.. ప్రతి రోజూ పెద్ద టాస్క్‌.. రిషబ్ శెట్టి కష్టంపై ప్రగతి ఏమోషనల్!

Pragathi Shetty: బెంగళూరు నుంచి మకాం మార్చాం.. ప్రతి రోజూ పెద్ద టాస్క్‌.. రిషబ్ శెట్టి కష్టంపై ప్రగతి ఏమోషనల్!

రిషబ్ శెట్టి  'కాంతార: చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు రూ. 725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి ఘన విజయం సాధించినఈ బ్లాక్‌బస్టర్‌కు కథకుడిగా, దర్శకుడిగా, హీరోగా రుషభ్ నిలబడగా, ఆయన భార్య ప్రగతి శెట్టి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు.  ఈ సినిమా విజయం వెనుక ఉన్న వారిద్దరి అద్భుత ప్రయాణం, సవాళ్లు, వ్యక్తిగత త్యాగాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

టెకీ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా..

సాంప్రదాయ సృజనాత్మక నేపథ్యం లేకపోయినా, ఒకప్పుడు 9 నుంచి 5 గంటల వరకు టెక్ ఉద్యోగం చేసిన ప్రగతి, కాస్ట్యూమ్ డిజైనర్‌గా కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 'కాంతార' విజయం, ముఖ్యంగా రుక్మిణి వసంత (గౌరీ) పాత్ర కోసం ఆమె చేసిన అలంకరణకు వచ్చిన ప్రశంసలపై ప్రగతి స్పందిస్తూ, ఇది నాకు చాలా ఆసక్తికరమైన ప్రయాణం. నేను ఈ రోజు ఇక్కడ ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నాకు కాస్ట్యూమ్స్, ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఆసక్తి ఉండేది. 

రుషభ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఉద్యోగాన్ని వదిలి, అతనితో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను అని ప్రగతి శెట్టి  తెలిపారు.. 'సర్కారీ హి. ప్రా. శాలె', 'బెల్ బాటమ్', '777 చార్లీ' వంటి సినిమాలకు పనిచేశాను. ఇప్పుడు నా ప్రయాణం చూసుకుంటే గర్వంగా, దొరికిన అవకాశాలకు కృతజ్ఞురాలిగా ఉన్నాను అని అన్నారు. రుక్మిణి వసంత పాత్ర లుక్ గురించి మాట్లాడుతూ... మేము స్క్రిప్ట్ చర్చల్లో మొదట్నుంచీ ఉన్నాం. కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది కావడంతో, దీనికి ఖచ్చితమైన పరిశోధన సామాగ్రి దొరకలేదు. అందుకే, మేము పురాతన గ్రంథాలు, ఆలయ శాసనాలను చూసి నమూనాలను రూపొందించాం. ఈ రోజు రుక్మిణి లుక్‌ను అందరూ రీక్రియేట్ చేసి, సెలబ్రేట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా శ్రమంతా ఫలించింది ఆనందం వ్యక్తం చేశారు.

బెంగళూరు నుంచి  కుందాపురకు.. 

'కాంతార' కాస్ట్యూమ్స్‌కు సంబంధించి ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఎదురయ్యేవని ప్రగతి తెలిపారు. సినిమా షూటింగ్ కోసం మేము బెంగళూరు నుంచి సుమారు 440 కి.మీ దూరంలో  కుందాపురకు మారాల్సి వచ్చింది. తెరపై అందంగా కనిపించే ప్రదేశాలకు ప్రతిరోజూ చేరుకోవడం కష్టమయ్యేది. కొన్ని లొకేషన్లకు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా, భారతదేశం నలుమూలల నుంచి మెటీరియల్‌ను కుందాపుర వరకు రప్పించడం, ఆ ప్రాంతానికి తరలి రావడానికి ఇష్టపడని మంచి కార్మికులను ఒప్పించడం పెద్ద పని అని చెప్పారు. ఇంతటి భారీ చిత్రాన్ని తామిద్దరం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని పేర్కొన్నారు. పెద్ద టీమ్‌ను నిర్వహించడం, పిల్లలను, కుటుంబాన్ని చూసుకోవడం, రుషభ్ ఇతర పనులను సమన్వయం చేయడం అన్నీ తనకు పెద్ద టాస్క్‌గా మారాయని చెప్పారు. తమ పిల్లలను సైతం దగ్గర్లోని స్కూళ్లలో నే చేర్పించామని తెలపారు,

 భార్యాభర్తలుగా కలిసి పనిచేయడం కష్టమే అయినా...

రుషభ్ శెట్టి తనను 2016లో ఒక సినిమా ఈవెంట్‌లో చూడగానే ప్రేమించానని, పది నెలల్లోనే పెళ్లి జరిగిందని ప్రగతి వెల్లడించారు. భార్యాభర్తలుగా కలిసి పనిచేయడం కష్టమే అయినా, తామిద్దరం ఒకరి సృజనాత్మక ఉన్మాదాన్ని మరొకరు అర్థం చేసుకుంటామని చెప్పారు. కొన్నిసార్లు వాదించుకుంటాం, కానీ మా ఇద్దరి అహం కంటే 'కాంతార' చాలా పెద్దదని మాకు తెలుసు. అందుకే ఇద్దరం ఒక పరిష్కారానికి వస్తాం అని అన్నారు. పని విషయంలో రుషభ్ దర్శకుడు కాబట్టి ఆయన మాటకు తాను ఎప్పుడూ 'కాదు' చెప్పనని నవ్వుతూ అంగీకరించారు.

గత ఐదేళ్లుగా 'కాంతార' ప్రాజెక్ట్‌తో మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా ఎంతో పెరిగానని ప్రగతి తెలిపారు. ఈ సినిమా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడి, తన కుటుంబానికి, పిల్లలకు సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నానని, భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నానని ప్రగతి చెప్పారు.