
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కని సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 4న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన స్క్వాడ్ లో జడేజాను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట జడేజాకు రెస్ట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సీనియర్ ఆల్ రౌండర్ ని తప్పించామని అగార్కర్ చెప్పాడు. దీంతో జడేజా వన్డే ఫార్మాట్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ జడేజా ఆడతాడా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ సమయానికి ఆల్ రౌండర్ జడేజా ఖచ్చితంగా భారత జట్టులో ఉండాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. జడేజా జట్టులో ఎందుకు ఉండాలో కూడా వివరణ ఇచ్చాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. "అందరూ 2027 వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అతని వన్డే కెరీర్ ముగిసిందని ఎవరూ అనుకోవద్దు. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో అతడు ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. జడేజా ఫీల్డింగ్ చూస్తుంటే అతను 7-8 సంవత్సరాలు చిన్నగా ఉన్నాడేమో అనిపిస్తుంది. గ్రౌండ్ లో అతను బంతిని ఛేజ్ చేస్తూ ఆపడం చాలా గొప్పగా ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టులో అక్షర్ పటేల్ ఉన్నాడు.
ఆస్ట్రేలియా లాంటి పర్యటనలో జడేజాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. ఆస్ట్రేలియాపై కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఒక స్పిన్నర్ సరిపోతాడు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో జరుగుతుంది.అక్కడ వేరు వేరు వేదికలపై వేరు వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అక్షర్ ఆడతారనుకుంటున్నా". అని శాస్త్రి తెలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపైనా జడేజా లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతైనా ఉంది. జడేజాను కాదని సుందర్, అక్షర్ కు ఛాన్స్ దక్కింది. చూస్తుంటే జడేజాను సైలెంట్ గా పక్కకు తప్పించి యంగ్ ప్లేయర్స్ సుందర్, అక్షర్ లకు వరల్డ్ కప్ సమయానికి ఎక్కువ ఛాన్స్ లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనుభవజ్ఞుడైన జడేజా 204 మ్యాచ్‌ల్లో 231 వికెట్లు పడగొట్టాడు. 2,806 పరుగులు చేసి బ్యాట్ తోనూ సత్తా చాటాడు. 2024 టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణించాడు. స్పిన్ ఆల్ రౌండర్ గా వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అనుకుంటే సెలక్టర్లు జడేజాకు ఊహించని షాక్ ఇచ్చారు.