రియాజ్ ఎన్ కౌంటర్ కేసులో కీలక పరిణామం.. డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు

రియాజ్ ఎన్ కౌంటర్ కేసులో కీలక పరిణామం.. డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు

హైదరాబాద్: రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 2025, నవంబర్ 24వ తేదీ లోగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదికను అందజేయాలని డీజేపీని ఆదేశించింది. 

2025, అక్టోబర్ 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రౌడీ షీటర్ రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‎ను పట్టుకుని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‎పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‎గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 19) నిందితుడు రియాజ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

►ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

నిజామాబాద్ నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్‎ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‎ను ఎన్ కౌంటర్ చేశారు.