
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. 2025, అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు 3 గంటల లోపు ఆర్వో ఆఫీస్ గేట్ లోపల ఉన్నవారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఈ మేరకు 3 గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు ఎలక్షన్ అధికారులు.
నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు, నిరుద్యోగులు, పలువురు ఓయూ విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు.
2025, అక్టోబర్ 22న నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఇచ్చారు. 2025, నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ అదే రోజు ఫలితం వెల్లడి కానుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక పార్టీలు ప్రచారం హోరెత్తించనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- అక్టోబర్ 13న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్
- అక్టోబర్ 13 నుంచి 21 వరకు నామినేషన్లకు గడువు
- అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ
- నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- నవంబర్ 11న కౌంటింగ్