
- సుందిళ్లకు మైలారం నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపు
- మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ అవసరం!
- మైలారం నుంచి సుందిళ్లకు తీసుకెళ్తే రూ.8 వేల కోట్లు ఆదా
- తుమ్మిడిహెట్టి అలైన్మెంట్ పరిశీలించనున్న ఆదిత్యనాథ్ దాస్
- ఆ తర్వాత మహారాష్ట్ర అధికారులతో మన ఆఫీసర్లు భేటీ అయ్యే చాన్స్
- ఈ భేటీ తర్వాత ఆ రాష్ట్రంతో.. సీఎం, మంత్రి ఉత్తమ్ చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇదివరకు అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందివ్వాలని భావిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న సిస్టమ్‌ను వాడుకోవాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఇప్పటికే రెండు ఆప్షన్లను ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం ముందు పెట్టగా ఆ రెండు ఆప్షన్లపై డిటెయిల్డ్ స్టడీ చేసి రిపోర్టు సమర్పించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల నిర్వహించిన రివ్యూలో ఆదేశించారు.
ఆ పనిలోనే ఇప్పుడు అధికారులు బిజీగా ఉన్నారు. రెండు ఆప్షన్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి.. అక్కడి నుంచి ఇప్పటికే మైలారం వరకున్న సిస్టమ్‌కు తరలించి అటు నుంచి సుందిళ్లకు తీసుకెళ్లడం ఒక ఆప్షన్ అయితే.. మైలారం నుంచి నేరుగా ఎల్లంపల్లికి తరలించడం మరో ఆప్షన్. అయితే, ఖర్చు, దూరం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు తీసుకెళ్లడమే మంచి ఆప్షన్ అని భావిస్తున్నట్టు తెలిసింది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు కెనాల్ నెట్‌వర్క్‌ను గతంలోనే (ఉమ్మడిఏపీలో) అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 71 కిలోమీటర్ల మేర కాల్వలను తవ్వింది.
అయితే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి.. రీడిజైన్ పేరిట రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. కానీ, ఆ ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన మూడేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో దానితో ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని సంకల్పించింది. అందులో భాగంగానే రివైజ్డ్ డీపీఆర్‌లను తయారు చేయాలని ఆదేశించింది.
రెండు ఆప్షన్లపై డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ఇప్పుడున్న నెట్‌వర్క్‌లో భాగంగా మైలారం నుంచి ఇప్పటికే ఉన్న సుందిళ్లకు నీటిని తరలించి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైలారం నుంచి ఎల్లంపల్లికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అక్కడికి మైలారం నుంచి లిఫ్ట్ అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లొచ్చని చెబుతున్నారు. అయితే, మధ్యలో కొండ ప్రాంతాలు ఉండడం వల్ల 20 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు.
రిపోర్టు ఆలస్యమయ్యే అవకాశం
రెండు ఆప్షన్లపై బుధవారం (అక్టోబర్ 22 నాటికి) రిపోర్టు ఇవ్వాల్సి ఉన్నా.. నివేదిక కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ ఆదిత్య నాథ్ దాస్తుమ్మిడిహెట్టి ప్రాంతానికి వెళ్లి పాత నెట్‌వర్క్‌ను పరిశీలించి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ఆయన పరిశీలన పూర్తయ్యాకే ఆ రెండు ఆప్షన్లపై రిపోర్టును ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని సమాచారం. ఆ
యన పర్యటన తర్వాత.. అధికారులు మహారాష్ట్రకు వెళ్లి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం గురించి.. అక్కడి అధికారులతో చర్చించనున్నట్టు తెలిసింది. అధికారుల చర్చల అనంతరం సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యే చాన్స్ ఉందని సమాచారం. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేందుకు చర్చిస్తారని, ముంపు ఎంతున్నా అందుకు తగ్గట్టుగా పరిహారం ఇస్తామని చెప్పనున్నట్టు తెలిసింది. ఒకవేళ మహారాష్ట్ర అందుకు అంగీకరించుకుంటే.. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి చర్చలు జరిపే సూచనలున్నాయి.
మైలారం నుంచి ఎల్లంపల్లి దూరం.. అదనపు ఖర్చు
మరో ఆప్షన్‌గా మైలారం నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లడంపైనా ఆలోచనలున్నాయి. అయితే, మైలారం నుంచి ఎల్లంపల్లికి మధ్యన 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో పాటు.. అక్కడికి నీళ్లు తరలించేందుకు మధ్యలో ఒక చిన్నపాటి లిఫ్ట్‌ను నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 14 మీటర్ల నుంచి 20 మీటర్ల ఎత్తుతో లిఫ్ట్, పంప్‌హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అదనపు ఖర్చులు పెట్టాల్సి ఉంటుందని, ఇందులోనూ టన్నెల్ తప్పనిసరి అవుతుందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మైలారం నుంచి నేరుగా ఎల్లంపల్లికి తీసుకెళ్లే బదులు.. మైలారం నుంచి సుందిళ్లకు నీటిని గ్రావిటీ ద్వారా తీసుకెళ్తే.. దాదాపు రూ.8 వేల కోట్ల దాకా ఆదా చేసేందుకు అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తున్నది.