మీ ఆటగాడిని పంపి ఆసియా కప్ తీస్కోండి: బీసీసీఐ లేఖకు మొహ్సిన్ నఖ్వీ రెచ్చగొట్టే రిప్లై

మీ ఆటగాడిని పంపి ఆసియా కప్ తీస్కోండి: బీసీసీఐ లేఖకు మొహ్సిన్ నఖ్వీ రెచ్చగొట్టే రిప్లై

దుబాయ్: ఆసియా కప్ ముగిసి దాదాపు నెల కావొస్తున్నా.. టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 ఆసియా కప్ విజేతగా ఇండియా నిలిచిన విషయం తెలిసిందే. 2025, సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‎లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎ను చిత్తు చేసి టీమిండియా విజేతగా అవతరించింది. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నిరసనగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‎గా ఉన్న  పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది.

టోర్నీ విజేతగా నిలిచినప్పటికీ ఒట్టి చేతులోనే దుబాయ్ నుంచి టీమిండియా ప్లేయర్స్ ఇండియా తిరిగొచ్చారు. దీంతో ఆసియా కప్ టైటిల్‎ను తన వెంటే తీసుకెళ్లారు మోహ్సిన్ నఖ్వీ. ఈ క్రమంలో ఆసియా కప్ 2025 ట్రోఫీని వెంటనే భారత క్రికెట్ జట్టుకు అందించాలని డిమాండ్ చేస్తూ బీసీసీఐ తాజాగా ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారికంగా లేఖ రాసింది.

ఇండియాకు టైటిల్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో బీసీసీఐ లేఖపై మోహ్సిన్ నఖ్వీ అంతే ఘాటుగా స్పందించాడు. ఆసియా కప్ ట్రోఫీని భారతదేశానికి అప్పగించడం కుదరదని తేల్చి చెప్పాడు. సరిహద్దులు దాటి ట్రోఫీని పంపాలని ఆశించొద్దని బీసీసీఐకి కౌంటర్ ఇచ్చాడు. ట్రోఫీని ఇండియాకు పంపేది లేదని కుండబద్దలు కొట్టాడు.

►ALSO READ | IND vs AUS: అది అత్యంత చెత్త నిర్ణయం.. రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించండి: టీమిండియా మాజీ బ్యాటర్

ఒకవేళ బీసీసీఐ ట్రోఫీ కావాలనుకుంటే.. ఇండియాలో ఒక ప్రజెంటేషన్ వేడుకను నిర్వహించి.. ఆ వేడుకలో తన చేతుల మీదుగా ఆసియా కప్ టైటిల్ తీసుకోవడానికి ఒక టీమిండియా ప్లేయర్‎ను పంపాలని బీసీసీఐకి సూచించాడు మోహ్సిన్ నఖ్వీ. ఇప్పటికే నఖ్వీ తీరుపై పీకలదాకా కోపంతో ఉన్నా బీసీసీఐ.. తాజా రిప్లైపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వివాదం చిలికి చిలికి ఐసీసీ వద్దకు చేరేలా కనిపిస్తోంది.