తెలంగాణకు వాన కబురు.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు చెప్పిన వాతావరణ శాఖ

తెలంగాణకు వాన కబురు.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు చెప్పిన వాతావరణ శాఖ

హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేటి నుంచి మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల చక్రవాక ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రము,  దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. సోమవారం ఇంచుమించు అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తువరకు విస్తరించింది.

ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో రాగల 12 గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 36 గంటలలో ఈ అల్పపీడన ప్రాంతం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి బలపడి దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్య ప్రాంతం,  దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం.. బుధవారం (రేపు) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

అక్టోబర్ 23, 24 వ తేదీలలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD పేర్కొంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో  అక్టోబర్ 23న భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.