
న్యూఢిల్లీ: ఈసారి దీపావళికి జనం భారీగా ఖర్చు పెట్టారు. పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాల విలువ రికార్డు స్థాయిలో రూ. 6.05 లక్షల కోట్లు దాటింది. వీటిలో వస్తువుల అమ్మకాలతో రూ. 5.40 లక్షల కోట్లు, సేవల ద్వారా రూ. 65 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఇటీవలి జీఎస్టీ తగ్గింపు, బలమైన వినియోగదారుల సెంటిమెంట్‌తో వ్యాపారం పెరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) మంగళవారం తెలిపింది.
ఈ సంస్థ దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులలో, టైర్ 2, టైర్ 3 నగరాలలో సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. గత సంవత్సరం దీపావళి అమ్మకాల విలువ రూ. 4.25 లక్షల కోట్లు ఉంది. ఈసారి మొత్తం వ్యాపారంలో 85 శాతం వాటా నాన్–-కార్పొరేట్, సంప్రదాయ మార్కెట్లతో సహా మెయిన్‌లైన్ రిటైల్ మార్కెట్ల నుంచే వచ్చింది. రిటైల్స్టోర్లలో, చిన్న వ్యాపార సంస్థల్లో భారీగా వ్యాపారం జరిగింది.-- సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా మాట్లాడుతూ... ప్యాకేజింగ్, ఆతిథ్యం, క్యాబ్ సేవలు, ప్రయాణం, ఈవెంట్ మేనేజ్మెంట్, టెంట్, డెకరేషన్, మ్యాన్‌పవర్, డెలివరీ వంటి రంగాల్లో రూ. 65 వేల కోట్ల కోట్లు వ్యాపారం జరిగిందని తెలిపారు.
నిత్యావసరాలు, చెప్పులు, దుస్తులు, స్వీట్లు, ఇంటి అలంకరణ, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల అమ్మకాలు పెరిగాయని72 శాతం మంది వ్యాపారులు పేర్కొన్నారు. ధరలు తగ్గడంతో వినియోగదారులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ పండుగ జోరు జనవరి మధ్య నుంచి రాబోయే పండుగల సీజన్లో కూడా కొనసాగుతుందని రిపోర్ట్ పేర్కొంది. ఈసారి దీపావళి కోసం వ్యాపారం లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, రవాణా, రిటైల్ సంస్థలు 50 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చాయి. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల వాటా 28 శాతం వరకు ఉంది.
అమ్మకాల్లో పెరుగుదల (అంకెలన్నీ శాతాల్లో)
- కిరాణా సామగ్రి, ఎఫ్ఎంసీజీ: 12
- బంగారం, ఆభరణాలు: 10
- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు: 8 శాతం
- కన్స్యూమర్ డ్యూరబుల్స్, గార్మెంట్స్, గిఫ్టులు: 7 శాతం చొప్పున
- ఇంటి అలంకరణ, ఫర్నిషింగ్, ఫర్నిచర్, స్వీట్స్: 5 చొప్పున
- టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్: 4 శాతం చొప్పున
- పూజా సామగ్రి, పండ్లు, డ్రై ఫ్రూట్స్: 3 శాతం చొప్పున పెరిగాయి.
ఈ-కామర్స్ ఇండస్ట్రీకి బూస్ట్
ఈ-కామర్స్ రంగానికి కూడా దీపావళి అద్భుతమైన వృద్ధిని అందించింది. ఆర్డర్ల సంఖ్య 24 శాతం, గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ)లో 23 శాతం పెరుగుదల కనిపించిందని ఈ-కామర్స్ ఎనేబుల్మెంట్ సాస్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తెలిపింది. క్విక్ కామర్స్ యాప్‌లు ఆర్డర్ల సంఖ్యలో గత ఏడాదితో పోలిస్తే120 శాతం పెరిగింది.
బ్రాండ్ వెబ్సైట్లు 33 శాతం వృద్ధిని సాధించాయి. ఎఫ్ఎంసీజీ, హోమ్ డెకార్, ఫర్నిచర్, బ్యూటీ, వెల్నెస్, హెల్త్, ఫార్మా ప్రొడక్టులు ఎక్కువగా అమ్ముడయ్యాయి. మొత్తం బిజినెస్‌లో టైర్–2, టైర్–3 నగరాల వాటా 55 శాతం ఉంది. ప్రీపెయిడ్ ఆర్డర్లు 26 శాతం పెరిగాయి. క్యాష్-ఆన్-డెలివరీ (సీఓడీ) ఆర్డర్లు 22 శాతం పెరిగాయి.