రోజుకు రెండుసార్లు సముద్రంలో మాయమైపోయే వింత ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?

 రోజుకు రెండుసార్లు సముద్రంలో మాయమైపోయే వింత ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?

మీరు ఒక శివాలయం ముందు నిలబడి పూజ చేసుకుంటున్నారు అనుకుందాం.. చూస్తుండగానే ఆ గుడి సడన్ గా మాయమైపోతే ఎలా ఉంటుంది..? వినడానికే ఏదో సినిమా సీన్‌లా వింతగా ఉంది కదూ ! కానీ ఇది అక్షరాలా నిజం... గుజరాత్‌లోని 'కవి కంబోయ్' అనే గ్రామంలో ఉన్న "స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం" లో ప్రతిరోజు జరిగే వింత ఇది. భారతదేశంలోనే అత్యంత రహస్యమైన, అద్భుతమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ గుడి రోజుకు రెండుసార్లు సముద్రపు అలల మధ్య పూర్తిగా మునిగిపోయి, ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతుంది!

సముద్రుడే అభిషేకం చేసే శివలింగం
అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివాలయానికి, సముద్రానికి ఒక విడదీయరాని సంబంధం ఉంది. సముద్రంలో పోటు (High Tide) వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అలలు వచ్చి ఆలయాన్ని పూర్తిగా ముంచేస్తాయి. ఆ సమయంలో గుడి గోపురం తప్ప మరేమీ కనిపించదు. మళ్లీ సముద్రంలో పాటు (Low Tide) వచ్చి నీటిమట్టం తగ్గగానే.. ఆలయం మెల్లిగా  బయటపడి సూర్యకాంతిలో మెరిసిపోతుంది. సముద్రుడే స్వయంగా రోజుకు రెండుసార్లు ఆ పరమశివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా ఉండే ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుండి వస్తుంటారు.

►ALSO READ | Health alert : వానకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలు

పురాణాల ప్రకారం ఈ గుడి కథ  
ఈ ఆలయ చరిత్ర గురించి మన స్కంద పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శివుని గొప్ప భక్తుడైన 'తారకాసురుడు' అనే రాక్షసుడిని కుమారస్వామి (కార్తికేయుడు) సంహరిస్తాడు. అయితే, శివభక్తుడిని చంపాననే బాధతో, ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం కార్తికేయుడు దేవతల సహాయంతో ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి, జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల బలమైన నమ్మకం.

భక్తులు పూజలు ఎలా చేస్తారు?
సముద్రంలో నీటిమట్టం తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే భక్తులు లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు, పూజలు చేస్తారు. మళ్లీ పోటు వచ్చే సమయానికి అక్కడి సిబ్బంది భక్తులందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించేస్తారు. ప్రకృతి అందాల నడుమ, భక్తిని, వింతను పంచే ఈ స్తంభేశ్వర మహాదేవ ఆలయ అద్భుత దృశ్యం ప్రతి ఒక్కరికీ ఒక లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పవచ్చు!