మహిళా వర్సిటీకి నిధులేవి?.. రూ.100 కోట్లు ఇస్తామని రిలీజ్ చేయలే

మహిళా వర్సిటీకి నిధులేవి?.. రూ.100 కోట్లు ఇస్తామని  రిలీజ్ చేయలే
  •   అసెంబ్లీలో మహిళా వర్సిటీ బిల్లు ఊసెత్తుతలే

హైదరాబాద్, వెలుగు: మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇస్తామని గతంలో చెప్పిన రాష్ట్ర సర్కారు.. ఆ నిధులను ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. దీనికి తోడు అసెంబ్లీలో మహిళా వర్సిటీ బిల్లు కూడా ప్రవేశ పెట్టలేదు. దీంతో నిధులు లేక వర్సిటీ నిర్వహణ కష్టమైతున్నది. హైదరాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజీని గతేడాది ఏప్రిల్ లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం అప్​గ్రేడ్ చేసింది. 2022–23లోనే డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించింది. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం దీన్ని అప్​గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అప్పట్లో ప్రకటించారు.

 అదే సమయంలో వర్సిటీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని అనౌన్స్ చేశారు. కానీ 2022-– 23లో  పైసా కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది  బడ్జెట్​లోనూ మళ్లీ రూ.100 కోట్లు కేటాయించారు. ఇప్పటికీ ఒక్క రూపాయి  కూడా వర్సిటీ అకౌంట్​లో పడలేదు. దాంతో నిధులు లేక వర్సిటీ నిర్వహణ కష్టంగా మారింది. ప్రస్తుతం పాత సిబ్బందితోనే వర్సిటీ కొనసాగుతోంది. తాజాగా వర్సిటీ లోగోను మంత్రి సబితారెడ్డి రిలీజ్ చేసినా నిధులు ముచ్చట ఏందో స్పష్టం చేయలేదు. హాస్టళ్లు, ఇతర భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించినా సర్కారు మాత్రం స్పందిస్తలేదు.  

ఈసారైనా  బిల్లు పెడ్తారా లేదా..? 

గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు పెట్టిన సర్కార్, మహిళా యూనివర్సిటీ బిల్లు మాత్రం ప్రవేశపెట్టలేదు.  గవర్నర్ తిప్పిపంపిన ప్రైవేటు వర్సిటీల బిల్లును మళ్లా అసెంబ్లీలో పెడ్తామని  సర్కారు ప్రకటించింది. కానీ మహిళా వర్సిటీ బిల్లు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వనే లేదు. దీంతో ఈ ఏడాది కూడా మహిళా వర్సిటీ బిల్లు పెట్టే చాన్స్ ఉందా లేదా అని అనుమానం కలుగుతోంది. వర్సిటీ యాక్ట్ అయితేనే యూజీసీ గుర్తింపు లభిస్తోంది. దానివల్ల వర్సిటీకి ప్రత్యేకంగా ప్రాజెక్టులూ వచ్చే అవకాశముంటుంది.