- ఇప్పుడున్న 12 వేల ఎకరాలకుతోడు మరో 13వేల ఎకరాల్లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఉన్న ఫార్మాసిటీ ప్రాంతంలోనే ఫోర్ట్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఇంకొంత భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫార్మాసిటీ కూడా ఫ్యూచర్ సిటీలోనే భాగమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం 12 వేల ఎకరాల పైన భూమిని సేకరించింది.
అదే ప్రాంతంలో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నది. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో గ్రీన్ ఫార్మా కంపెనీలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నది. వీటితో పాటు యూనివర్సిటీలు, హెల్త్ టూరిజం డెవలప్ మెంట్ , ఈవీ బ్యాటరీలు, స్పోర్ట్స్ విలేజ్ , ఐటీ వంటివి ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో, ఓఆర్ఆర్ నుంచి కనెక్టెవిటీ వంటి వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
25వేల ఎకరాల్లో!
వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్ తదితర మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఇందులో 12 వేల ఎకరాలపైన సేకరించిన భూమికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయాలనుకున్న భూములను ఫోర్త్ సిటీకి వాడుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే భూసేకరణ చట్టం 2013 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ల్యాండ్స్‌ను వాటికే వినియోగించాల్సి ఉంటుంది.
దీంతో ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ ఫార్మా కంపెనీలకు కూడా అవకాశం కల్పించనుంది. ఇప్పుడున్న 12 వేల ఎకరాలకు మరో 13 వేల ఎకరాలు అంటే 25 వేల ఎకరాలకు ఫోర్త్ సిటీని విస్తరించనుంది. ఈ ల్యాండ్‌ను కూడా ప్రభుత్వం సేకరించాలనుకుంటున్నది.
ఫోర్త్ సిటీ కోసం ఇప్పటికే అనుకున్న ప్లాన్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి 297 ఎకరాలు, యూనివర్సిటీల జోన్‌కు 454 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర సాధారణ ఇండస్ట్రీలకు 4,774 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ జోన్‌కు 470 ఎకరాలు, ఫర్నిచర్ పార్క్‌కు 309 ఎకరాలు, హెల్త్ సిటీకి 370 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4207 ఎకరాలు, నివాస, వాణిజ్య ప్రాంతాలకు 1317 ఎకరాలు, పూర్తి నివాస ప్రాంతాలకు 1013 ఎకరాలు, స్పోర్ట్స్ హబ్‌కు 761 ఎకరాలు ప్రతిపాదించారు. ఇప్పుడు వీటిలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది.