కాశీబుగ్గ, వెలుగు: క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదివారం మేడారం వెళ్తున్న క్రమంలో హనుమకొండలోని ఎన్ఐటీ అతిథి గృహానికి వచ్చారు. దీంతో వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసిశారు.
రామప్పను సందర్శించిన సీఎం ముఖ్య కార్యదర్శి
వెంకటాపూర్( రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ వెంకటేశ్ టెంపుల్ చరిత్ర శిల్పకళా వైభవాన్ని ఆయనకు వివరించారు. ఆయనవెంట వెంకటాపూర్ త హసీల్దార్ గిరిబాబు, రామప్ప హోటల్ మేనేజర్ రంజిత్ తదితరులున్నారు. నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా రామప్ప టెంపుల్ సందర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో ప్రజల పక్షాన నిజాయితీగా పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. పట్టణంలోని సీపీఎం ఆఫీస్లో ఆదివారం బూడిద గోపి అధ్యక్షతన పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన కనకారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. జనగామ పట్టణంలో ఇండ్ల స్థలాలు, పెన్షన్లు. తదితర సమస్యల పైన పోరాటం నిర్వహించిన చరిత్ర తమ పార్టీకున్నది కాబట్టి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గీత కార్మికుడు మృతి
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ప్రమాదవశాత్తు తాటిచెట్టు నుంచి పడి చికిత్స పొందుతున్న కనకయ్య(55) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత నెల 31న మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తాటిచెట్టు పై కల్లు గీసే క్రమంలో జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 18 రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
