
కరీంనగర్ జిల్లా: విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ ఎద్దు బలైంది. కరెంటు తీగలు కిందికి వేలాడటంతో ప్రమాదవశాత్తు ఎద్దు అక్కడికక్కడే మరణించగా.. రైతు గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఇవాళ ఉదయం దుక్కి దున్నుతుండగా ఎద్దు కొమ్ములకు కరెంట్ తీగలు తగిలాయి. లైన్ ఆన్ లోనే ఉండటంతో నిప్పులు చెలరేగుతూ విద్యుత్ షాక్ గురైన ఎద్దు చనిపోయింది. కాపాడేందుకు ప్రయత్నించిన రైతు( మేకల రమేశ్)కు స్వల్ప షాక్ తగలడంతో గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రైతును స్థానిక హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందించినట్లు తెలిపారు. కరెంట్ వైర్లు కిందికి ఉండటంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు సీరియస్ అయ్యారు. విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, అలాగే చనిపోయిన ఎద్దుకు నష్టపరిహారం అందించి, గాయపడ్డ రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం సాగు మొదలైన రోజే రైతుకు చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.