పల్లెలు, పట్టణాల్లో త్వరలో ఆకస్మిక తనిఖీలు

పల్లెలు, పట్టణాల్లో త్వరలో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకొని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. తాను ఆకస్మిక తనిఖీలు చేపడుతానన్నారు. క్యాంప్ ఆఫీస్ లో అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారులతో పల్లె ప్రగతి,  పట్టణ ప్రగతిపై రివ్యూ చేశారు సీఎం. తాను సమావేశం నిర్వహించి వివరించినా సరిగా పనిచేయకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. ఈనెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు సీఎం. జూన్  21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు.  వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా  కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి.. కొత్తగా నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 

వరంగల్ లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 24 అంతస్తులతో.. అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలన్నారు సీఎం. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా  బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ నిర్మించాలన్నారు. కెనడా మోడల్ లో,  గాలి వెలుతురు వచ్చే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.