ముంబై తీరంలో నీటమునిగిన నౌక.. ఇంకా ఆచూకీ దొరకని 37 మంది

ముంబై తీరంలో నీటమునిగిన నౌక.. ఇంకా ఆచూకీ దొరకని 37 మంది
  • పి.305 బార్జ్ నౌక నుంచి 49 మృతదేహాలు వెలికితీత
  • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

ముంబయి: తౌక్టే తుపాను ప్రభావంతో ముంబయి తీరంలో మునిగిన వ్యాపార నౌక ( బార్జ్ పి.305) నుంచి ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ముంబయి తీరంలో లంగరు ఊడిపోయి పి.305 నౌకతోపాటు మరో రెండు పడవలు, ఒక ఆయిల్ రిగ్ సముద్రంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో పి.305 బార్జ్ మునిగిపోయే దశలో ఉండగా గుర్తించిన నావికా దళం యుద్ధ పడవలతో రంగంలోకి దిగింది. 185 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా 22 మంది చనిపోయారు. గల్లంతైన వారి కోసం మూడు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నాలుగో రోజైన గురువారం నాడు మరో 27 మృతదేహాలు దొరికాయి. మరో 37 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. హెలికాప్టర్లతోనూ యుద్ధ పడవలతోనూ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ గాలింపు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో పి.305 బార్జ్ నౌక లోని 26 మంది, టగ్‌బోటుకు సంబంధించి 11 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు.