తెలంగాణలో 10 ఎంపీ సీట్లు కాంగ్రెస్ వే!?

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు కాంగ్రెస్ వే!?

 

  • బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు
  •  మెదక్ కే పరిమితం కానున్న బీఆర్ఎస్
  •  జహీరాబాద్ లో కాంగ్రెస్Xబీజేపీ టఫ్​ ఫైట్
  •  కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వచ్చే చాన్స్
  • బీజేపీ అగ్రనేత అంతర్గత సర్వేలో వెల్లడి?
  • 600 మందితో సీక్రెట్ సర్వే!

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎలక్షన్ లోనూ ప్రతిబించనున్నాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంపై బీజేపీ సీరియస్ గా దృష్టి సారించింది. కనీసం పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ జాతీయ స్థాయి అగ్రనేత ఒకరు రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో 600 మందితో కూడిన సర్వే టీంను షా తెలంగాణ రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఆ టీం ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించింది. ఈ సందర్భంగా నమ్మలేని అంశాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 39.40 శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 13.90 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంటుందని షా సర్వే చెబుతోంది. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ మాత్రమే. అందులోనూ కేసీఆర్ లేదా హరీశ్ రావు నిబడితేనే గెలుపు సాధ్యమట. అలా కాకుండా వేరే ఎవరికైనా ఇస్తే అక్కడా కాంగ్రెస్ గెలుస్తుందన్నది సర్వేలో వెల్లడైన మరో కీలక విషయం.  

బీజేపీకి ప్లస్ 2

పది సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎన్నికల బరిలోకి దిగనున్న బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే చెబుతోంది. గతంలో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీలుగా గెలుపొందారు.  ఈ నాలుగింటికీ చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు తోడవుతాయని అమిత్ చేయించిన సర్వేలో తేలిందని సమాచారం. 

పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్​

అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల కాంగ్రెస్, ఒక సెగ్మెంట్ లో ఆ పార్టీ మిత్రపక్షమైన సీపీఐ విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో  ప్రజల పాలన మొదలవటం, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం, సెక్రటేరియట్ లోకి అందరికీ ప్రవేశం కల్పించడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించడం, ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని విడమర్చి చెబుతుండటం కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తోంది.  దీనికి తోడు స్థానిక సంస్థలు కూడా అవిశ్వాస తీర్మానాలతో అధికార పార్టీ వశమవుతుండటం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది. కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని సర్వే చెబుతోంది. అధికార  కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు లభిస్తాయన్నది సర్వే సారాంశం. జహీరాబాద్ సెగ్మెంట్ లో మాత్రం నువ్వానేనా అన్న విధంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు జరుగుతుందని, అయినా కాంగ్రెస్ కే ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువన్నది సర్వే సారాంశం. 

ఇద్దరు మిత్రులకు ఒక్కొక్కటేనా?

బీఆర్ఎస్–ఎంఐఎం పార్టీలకు ఒక్కొక్క ఎంపీ స్థానమే దక్కే అవకాశం ఉందని సమాచారం. మెదక్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, లేదా హరీశ్ రావు పోటీ చేస్తేనే కారు గెలుస్తుందట లేని పక్షంలో ఆ సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ వశమవుతుందని సర్వే  చెబుతోంది. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో పతంగ్ ఎగురుతుందని సమాచారం.  ఇక్కడి నుంచి ఎంఐఎం విజయం సాధిస్తుందని సర్వేలో తేలినట్టు సమాచారం. 

కాంగ్రెస్ 

 ఖమ్మం 
నల్గొండ
భువనగిరి
మహబూబాబాద్
వరంగల్
నాగర్ కర్నూలు
మాల్కాజ్ గిరి
మెదక్
పెద్దపల్లి
జహీరాబాద్ ( కాంగ్రెస్ vs బీజేపీ టప్ ఫైట్  50 -50 ఛాన్స్ , కానీ ఎడ్జ్ కాంగ్రెస్ కు ఉంటుందట)

బీజేపీ

మహబూబ్ నగర్ 
సికింద్రాబాద్
చేవెళ్ల
కరీంనగర్
నిజామాబాద్ 
ఆదిలాబాద్

ఎంఐఎం

హైదరాబాద్

బీఆర్ఎస్

మెదక్ (కేసీఆర్ లేదా హరీశ్ రావు క్యాండిడేట్లు అయితేనే)