తాలిబన్ల ఆధీనంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్

తాలిబన్ల ఆధీనంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్
  • అన్ని వైపుల నుంచి తాలిబన్లు రాజధానిలోకి చొచ్చుకువచ్చారని చేతులెత్తేసిన ప్రభుత్వం
  • ‘‘శాంతియుతంగా లొంగిపోవడం’’ గురించి చర్చలు జరుపుతున్నామని ప్రకటించిన అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంపై తాలిబన్లు జెండా ఎగరువేశారు. రాజధాని నగరంలోకి అన్నివైపుల నుండి చొచ్చుకువచ్చారు. నగరం అంతా తమ ఆధీనంలోకి రావడంతో ఎలాంటి దాడులకు దిగకుండా పాలకులతో చర్చలకు వేచి చూస్తున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా పోరాడలేక చేతులెత్తేసింది. తాలిబన్ దళాలు అన్ని వైపుల నుంచి రాజధానిలోకి చొచ్చుకు వచ్చేశారని.. అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు ప్రకటించారు. తాలిబన్లతో పోరాటం చేయడం లేదని.. అధికారాన్ని వారికి శాంతియుతంగా అప్పగించేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 
మరోవైపు కాబుల్ రాజధానిలో కాలుమోపిన తాలిబన్లు కూడా విజయదరహాసం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి దాడులకు దిగకపోవడంతో.. దౌర్జన్యంగా కాకుండా.. శాంతియుతంగానే పాలన పగ్గాలు చేపట్టే అవకాశం కోసం వేచిచూస్తున్నట్లు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో కాబుల్ రాజధానిలోకి తాలిబన్లు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ అంచనా వేయగా.. తాలిబన్లు అందరి ఊహలను తలకిందులు చేస్తూ.. ఒకరోజు ముందే కాబుల్ ను హస్తగతం చేసుకున్నారు. తాలిబన్ దళాలతో పోరాడలేమని నిర్దారించుకున్న అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను ఇళ్లకు పంపించేశారు. అమెరికా దౌత్య కార్యాలయంపై నుంచి హెలికాఫ్టర్ల ద్వారా దౌత్య సిబ్బందిని తరలించడం ప్రారంభించడంతో ప్రభుత్వ ఓటమి అందరికీ అర్థమైపోయింది. కాబుల్ లోని అమెరికా దౌత్య కార్యాలయం లో నుంచి నల్లటి దట్టమైన పొగ రావడంతో ఖాళీ చేసి వెళ్లే ముందు కీలకమైన పత్రాలను కాల్చివేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాలిబన్లు కాబుల్ లోకి ప్రవేశిస్తుంటే ప్రభుత్వం పోరాడలేక చేతులెత్తేయడం గుర్తించిన  చెక్ రిపబ్లిక్ దేశం తమ దౌత్యవేత్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాలిబన్లు కాబుల్ లో కాలుమోపడం లాంఛనంగా కనిపించడంతో దేశ ప్రజలు తాము బ్యాంకుల్లో దాచుకున్న నగదు తీసేసుకోవడానికి రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఏటీఎం కేంద్రాలు ఖాళీ అవగా.. బ్యాంకుల్లో సైతం నగదు నిల్వలు నిండుకోవడంతో తమ డబ్బు కోసం జనం ఆశగా బారులుతీరడం కనిపిస్తోంది. ఆదివారం ఉదయమే తాలిబన్లు రాజధానిలో కాలుమోపడంతో పౌరుల్లో భయం భయంగా కనిపించారు.