రజనీకాంత్కు మద్దతుగా బీజేపీ.. అందులో తప్పేముంది?

రజనీకాంత్కు మద్దతుగా బీజేపీ.. అందులో తప్పేముంది?

ఉత్తరప్రదేశ్ టూర్ లో భాగంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసానికి వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు.  72 ఏళ్ల రజినీకాంత్ ..తనకంటే చిన్నవారైన యోగి పాదాలను తాకడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.  దక్షిణాదికి వెళ్లిన రజనీకాంత్ ఉత్తరాది ప్రజల పరువు తీసేశారని చాలా మంది ట్విట్టర్‌లో విమర్శించడం మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో రజినీకాంత్ కు మద్దతుగా నిలిచారు తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై.  "యోగి జీ గోరఖ్‌పూర్ మఠానికి అధిపతి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలు ఆయనను 'మహారాజ్' అని పిలుస్తారు. కాబట్టి..  రజనీకాంత్ కాళ్లపై పడితే అందులో తప్పు ఏమిటి? దీని అర్థం ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాదు.

రజనీకాంత్ యోగి జీని, ఆయన ఆధ్యాత్మికతను గౌరవిస్తారని చూపిస్తుంది.  రజినీ యోగి జీపై తనకున్న  ప్రేమ, ఆప్యాయతని మాత్రమే చూపించాడు" అని అన్నామలై అన్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయాన్ని విమర్శించడం మొదలుపెడితే అంతు అనేది ఉండదన్నారు.  తమిళనాడులోని మంత్రులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాళ్లపై పడుతున్నారని అన్నామలై  తెలిపారు. 

ఇదిలా ఉండగా సన్యాసి లేదా యోగి కనిపిస్తే తనకు  వయస్సుతో సంబంధం లేకుండా వారి పాదాలపై పడటం తనకు అలవాటని..  అదే తాను  చేసానని  రజనీకాంత్ అన్నారు.  ఇటీవల లక్నో పర్యటన సందర్భంగా యోగి పాదాలను తాకడంపై జరిగిన చర్చలపై చెన్నైలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.