వ్యాక్సిన్ మొహం చూడని దేశాలెన్నో ఉన్నాయి

వ్యాక్సిన్ మొహం చూడని దేశాలెన్నో ఉన్నాయి
  • ధనిక దేశాలు 83 శాతం వ్యాక్సిన్లు తీసుకుంటున్నాయి
  • పేద దేశాల పట్ల ధనిక దేశాలు కనికరం చూపాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్ మొహం చూసి ఎరగని పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.  దుస్ధితిలో ఉన్న పేద దేశాలను ధనిక దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ గెబ్రెయేషన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ లో 83 శాతం ధనిక దేశాలే తీసుకుంటున్నాయని.. పేద దేశాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రపంచ జనాభాలో సగం జనాభా ఉన్న ధనిక దేశాలు 83 శాతం వ్యాక్సిన్లు తీసేసుకుంటే మిగిలిన సగం జనాభా ఉన్న పేద దేశాలు వ్యాక్సిన్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియలో అసమానత్వం వల్ల పేద దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చాక వినియోగం మొదలైన వెంటనే సంపన్న దేశాలే వ్యాక్సిన్ తీసేసుకుంటాయని WHO మొదటి నుంచి చెబుతూనే ఉందని.. ఇప్పుడు అదే అమలు జరుగుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద దేశాలకు వ్యాక్సిన్ చేరేలా.. వాటిని ఆ దేశాలు సమర్థవంతంగా వినియోగించుకునేలా ధనిక దేశాలు సహాయం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుదుకు డబ్ల్యూ హెచ్ ఓ ‘‘కోవాక్స్’’ ద్వారా వ్యాక్సిన్ అందించాలని ప్రయత్నాలు చేస్తున్నా.. ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా దేశాలకు సరిపడా వ్యాక్సిన్ పంపలేని పరిస్థితి ఉందన్నారు. వ్యాక్సిన్ రాకముందు నుంచి ముందస్తు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ధనిక దేశాలు వ్యాక్సిన్ సమీకరణలో ముందుకెళ్లిపోతున్నాయని.. దీని వల్ల పేద దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు.  ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ కొత్తగా పుట్టుకొచ్చే కొత్తరకం వైరస్ లను ఎదుర్కోవడంలో వాటికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాదని పేద దేశాలను నిర్లక్ష్యం చేస్తే కరోనా వైరస్ ను భూమి మీద నుంచి సమూలంగా నిర్మూలించడం, కంట్రోల్ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించారు.