
హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమాను మరో నాలుగేండ్లు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆదేశిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రమాద బీమాను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తు మృతి చెందిన మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా అందజేస్తున్నారు.
కష్టకాలంలో ఆ కుటుంబాలకు భరోసాగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 419 మంది ప్రమాద బీమా మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 204 కేసుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.20.40 కోట్లు చెల్లించారు. మిగిలిన 195 కేసులకు సంబంధించి ప్రమాద బీమా చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం బీమా చెల్లిస్తుండటంతో మహిళలు గ్రూపుల్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాల్లో 47 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా.. 1.67 లక్షల మంది కొత్త సభ్యుల చేరినట్లు వెల్లడించారు. అదేవిధంగా 5,474 మంది లోన్ బీమా కోసం నమోదు చేసుకోగా.. 2,663 మందికి సెటిల్ చేశారు. అందుకోసం రూ.21.25 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వారికి సంబంధించి రూ.42.87 కోట్లు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.