హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కరెంటు వినియోగ చార్జీల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.
పంచాయతీల వారీగా పేరుకుపోయిన బకాయిలు, ప్రస్తుత చెల్లింపులపై స్పష్టమైన నివేదిక కావాలని స్పష్టం చేసింది. వివరాలు పంపడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో చర్చించి, బిల్లుల వివరాలను సరిచూసుకోవాలని పేర్కొంది. డిస్కమ్ రికార్డుల్లో ఉన్న బకాయిలు, పంచాయతీల వద్ద ఉన్న లెక్కలు సరిపోల్చాలని సూచించింది. ఈ సమాచారాన్ని గూగుల్ షీట్‌లో తక్షణమే అప్‌లోడ్ చేయాలని, గడువులోగా వివరాలు అందకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ రిపోర్టుల ఆధారంగానే పంచాయతీల కరెంటు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.
