మేడారం జాతరపై కేంద్రం సైలెంట్..20 రోజుల్లో జాతర షురూ

మేడారం జాతరపై కేంద్రం సైలెంట్..20 రోజుల్లో జాతర షురూ
  • రూ. 150 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్
  • ట్రైబల్ శాఖ పంపిన ప్రతిపాదనలకు ఇప్పటివరకూ నో  రెస్పాన్స్
  • -2024లో జాతరకు రూ. 3.14 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం
  • ఈ సారి రూ. 300 కోట్ల స్టేట్ ఫండ్స్​తో మేడారంలో అభివృద్ధి పనులు

హైదరాబాద్ , వెలుగు: దక్షిణ భారతదేశ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై కేంద్రం సైలెంట్‌‌గా ఉన్నది. రూ. 150 కోట్ల ఫండ్స్‌‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటివరకూ స్పందనలేదు. మరో 20 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండగా.. నిధులు ఇస్తారో? ఇయ్యరో? అనేదానిపై కనీస స్పష్టత కరువైంది.  ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్నది.  దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 2 కోట్ల  మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతర కోసం రాష్ట్ర  ప్రభుత్వం సుమారు  రూ. 300 కోట్లతో గత మూడు నెలల నుంచి వేగంగా పనులు చేస్తున్నది.సమ్మక్క –సారలమ్మ గద్దెలను ఆధునీకరిస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకోగా.. ఈనెల 19న సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు. జాతర టైమ్‌‌లో రాలేని పబ్లిక్ గత నెల రోజుల నుంచే మేడారానికి తరలి వస్తున్నారు.   

రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి

మేడారం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.300  కోట్ల వరకు నిధులను కేటాయించింది.  4,000 టన్నుల గ్రానైట్‌‌తో గద్దెల ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.  కాకతీయుల శిల్పకళా వైభవాన్ని తలపించేలా నిర్మాణాలు చేస్తున్నారు. 46 స్తంభాలతో విశాలమైన ప్రాకారాన్ని నిర్మించారు. భక్తుల రాకపోకల కోసం 8 ప్రధాన ద్వారాలు, భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. 8 స్తంభాలతో కూడిన వృత్తాకార గద్దెను నిర్మించారు. మేడారం చేరుకునే ప్రధాన రహదారులను 2- లేన్ల నుంచి 4-లేన్లకు విస్తరించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.  గద్దెల ప్రాంగణంలో గిరిజన వీరుల చరిత్రను ప్రతిబింబించేలా 7,000కు పైగా శిల్పాలను చెక్కుతున్నారు.​

కేంద్రం వివక్ష..

దేశంలో ప్రఖ్యాతి గాంచిన మేడారం జాతరపై మొదటినుంచీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. గత 10 ఏండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నిధుల్లో అరకొరగానే కేటాయిస్తున్నది. మేడారం సమ్మక్క– సార లమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. త్వరలో స్టార్ట్ కానున్న జాతరకు రూ. 150 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా.. స్పందన కరువైంది. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి  కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్నా మేడారంపై చిన్నచూపే చూస్తున్నారని రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్​నాయకులు మండిపడుతున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నా కేం ద్రంపై ఒత్తిడి తీసుకరావడం లేదని అంటున్నారు.  ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి సీతక్క కలిసి.. మేడారం జాతరకు నిధులు ఇవ్వాలని, జాతీయ పండుగగా గుర్తించాలని విన్నవించారు. అయినా.. ఎలాంటి ప్రకటన రాలేదు. 

పోయినేడాది 3.14  కోట్లే..

2024లో మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.115 కోట్లు కేటాయి స్తే.. కేంద్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా 
రూ. 3.14 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గిరిజన సంస్కృతి ప్రచారం, డాక్యుమెంటరీల రూపకల్పన, గిరిజన నృత్య ప్రదర్శనలు,  మ్యూజియం అభివృద్ధిలాంటి పనులకు ఈ నిధులను కేటాయించారు.   ఈ ఏడాది సుమారు రూ. 15 కోట్ల నిధులతో మేడారం జాతర సమీపంలోని గ్రామాల్లో భక్తులు రెస్ట్ తీసుకునేందుకు ట్రైబల్ శాఖ తరఫున షెడ్స్‌‌ నిర్మించేందుకుగానూ  గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. అయితే ఇంత వరకు కేంద్ర ట్రైబల్ , పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. 

జాతీయ హోదా ప్రకటించాలి

మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించాలి. ఇందుకోసం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌‌ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి. ఇప్పటి వరకు తాత్కాలిక పద్ధతిలో మేడారంలో పనులు చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించింది. కేంద్రం మాత్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఇప్పటికైనా మేడారం జాతరకు ఫండ్స్‌‌ రిలీజ్ ​చేయాలని కోరుతున్నాం. ఈ జాతర ఆదివాసీలది అయినా అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకతీతంగా వస్తున్నారు. వెంటనే నిధులు రిలీజ్ చేయాలని మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా.   మంత్రి సీతక్క