
- ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
- ‘ఇమేజ్ టవర్స్’ నిర్మాణం, ఏవీజీసీ సౌలతులకు ఆర్‌ఎఫ్‌పీని ఆహ్వానించిన టీజీఐఐసీ
- వచ్చే నెల ఒకటి వరకు బిడ్లు దాఖలు చేసేందుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాయదుర్గంలో యానిమేషన్, గేమింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకు తగ్గట్టుగా హైదరాబాద్‌లోని రాయదుర్గం ఇమేజ్ టవర్స్‌లో ‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఇండస్ట్రీ (ఏవీజీసీ)’ ని ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) అడుగులు వేస్తున్నది. ఏవీజీసీ నిర్మాణానికి కన్సల్టెంట్ల నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అడ్వైజరీ సర్వీస్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను ఆహ్వానించింది. ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా ఇమేజ్ టవర్స్‌లో 1.09 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏవీజీసీ సౌలతులు, మరో 67 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏవీజీసీ అకాడమీని ఏర్పాటు చేయనున్నది.
ఇందుకోసం ఈ నెల 17న టీజీఐఐసీ ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీని ఆహ్వానించగా.. బిడ్‌ను దాఖలు చేసేందుకు నవంబర్ 1ని గడువుగా విధించింది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు బిడ్లను తెరవనున్నది. ఈ నెల 22న ప్రీబిడ్ మీటింగ్‌ను నిర్వహించనున్నది. ఇమేజ్టవర్స్ ద్వారా ఫస్ట్ జనరేషన్ టెక్నోక్రాట్ ఆంత్రప్రెన్యూర్లకు.. ఏవీజీసీల ఏర్పాటుకు సబ్సిడీలను అందించనున్నది. ఏవీజీసీ సెక్టార్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఏవీజీసీని రెండు భాగాలుగా విభజించి.. ఆ సెక్టార్‌ను డెవలప్ చేయనున్నది. యానిమేషన్ ఫిల్మ్ అండ్ గేమింగ్‌తోపాటు ఏవీజీసీ మీడియా సపోర్ట్ సర్వీసెస్‌ను అందించనున్నది. మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఏడాదిలో ఈ ఏవీజీసీ ఫెసిలిటీని డెవలప్ చేసి టీజీఐఐసీకి అప్పగించాల్సి ఉంటుంది.
ఏర్పాటు చేసేవి ఇవే..
యానిమేషన్: యానిమేషన్ విభాగంలో భాగంగా 2డీ, 3డీ యానిమేషన్ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు, కొత్త యానిమేషన్ టెక్నిక్స్, టూల్స్‌ను కనిపెట్టేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్, డిజైన్ఆర్ట్ స్టూడియోలాంటి వాటిని ఏర్పాటు చేస్తారు.
విజువల్ ఎఫెక్ట్స్: ఇందులో ప్రీ ప్రొడక్షన్ స్టూడియో, ప్రొడక్షన్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్స్టూడియో, ఆడియో స్టూడియో, ఆర్ అండ్ డీ ల్యాబ్స్, డేటా మేనేజ్‌మెంట్‌లాంటివి ఏర్పాటు చేస్తారు.
గేమ్ డిజైన్: ఇక్కడ ఆన్లైన్ గేమ్స్‌ను అభివృద్ధి చేస్తారు. గేమ్ డెవలప్మెంట్ స్టూడియోలు, టెస్టింగ్ ల్యాబ్స్, ప్రొడక్షన్, టెక్నికల్ ఫెసిలిటీలు, ఏఐ/వీఆర్‌లాంటి ప్రత్యేకమైన ల్యాబులను నెలకొల్పుతారు.
కామిక్స్ క్రియేషన్: ఆర్ట్ స్టూడియోలు, రైటింగ్, స్ర్క్రిప్టింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ స్టూడియోలతోపాటు డిజిటల్ అసెట్మేనేజ్మెంట్లాంటి 18 రకాల వింగ్స్‌ను ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.
ఎక్స్‌టెండెట్ రియాలిటీ: ఇందులో భాగంగా కంటెంట్ క్రియేషన్ స్టూడియోలు, డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లాంటి 25 విభాగాలను దీంట్లో
నెలకొల్పుతారు.