
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆరు నెలల్లో రూ.2,233.21 కోట్లను రాష్ర్ట ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకంలో ఆయా ఇంటి నిర్మాణ పనులను బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తున్నారు. ఈ వారం రికార్డు స్థాయిలో 22,305 మంది లబ్ధిదారులకు రూ. 252.87 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
పథకం ప్రారంభమైన నాటి నుంచి ఒక వారంలో ఇంత పెద్ద మొత్తాన్ని లబ్ధిదారులకు విడుదల చేయడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బేస్ మెంట్ పూర్తి చేసిన 1,43,963 ఇండ్లకు రూ.1,439.63 కోట్లు, రూఫ్ లెవెల్ పూర్తి చేసిన 46,206 ఇండ్లకు రూ.462.06 కోట్లు, స్లాబ్ పూర్తి చేసిన 16,576 ఇండ్లకు రూ.331.52 కోట్లు చెల్లించినట్టు ఎండీ ప్రకటించారు.