- నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- దుప్పట్లు, పండ్లు పంపణీ చేసిన లీడర్లు
- సింగరేణి బొగ్గు గనులపై కార్యక్రమాలు
వెలుగు, నెట్వర్క్: తెలంగాణ ఉద్యమ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 11వ వర్ధంతిని సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాలు, మాల మహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో మండలాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సింగరేణి ఉద్యోగులు, కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, దళిత సంఘాల లీడర్లు కాకా ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్‌కుమార్ దీపక్ కాకా ఫొటోకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి కాకా ఫొటోకు నివాళులర్పించారు. ఆదిలాబాద్‌లోని మాల సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన వేడుకల్లో మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పాడిన మహానేత కాకా అని కొనియాడారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దుర్గం సందీప్ నివాళి అర్పించారు. నిమ్న వర్గాల ఆశాజ్యోతి వెంకటస్వామి అని అన్నారు.
సేవా కార్యక్రమాలు
బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో కాకా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో కూలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంచిర్యాలలోని మాతాశిశు ఆస్పతిలో కాంగ్రెస్‌నేత సుదమల్ల హరికృష్ణ, నస్పూర్ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ సేవాదళ్అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు, వివేక్ యువసేన లీడర్బారుపటి మారుతి ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.
మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 సింగరేణి బొగ్గు గనిపై వేడుకలు నిర్వహించారు. ఐఎన్టీయూసీ లీడర్బన్న లక్ష్మణ్‌దాస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల లీడర్ల సమక్షంలో కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వెంటకస్వామి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు.
లక్షల మంది పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించిన మహనీయుడని అన్నారు. తెలంగాణ కోసం సోనియా గాంధీని ఒప్పించారన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి, మలి దశ దశమకారుడిగా, కార్మిక పక్షపాతిగా జనాల గుండెల్లో నిలిచిపోయాని అన్నారు.
