- తోలు తీసే అంశాలు ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్
- పదేండ్లు అధికారంలో ఉన్నా పాలమూరు
- ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలే?: మంత్రి జూపల్లి
- ఏపీకి నిధులు తరలిపోతున్నా కేంద్రం వివక్షపై
- కేసీఆర్ ఎందుకు మాట్లాడలే: మంత్రి వాకిటి
- కవిత ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాపై ఏడుపెందుకు?: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో తోలుతీసే హక్కు కేవలం ప్రజలకు మాత్రమే ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్‌లో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై పోల్స్‌లో, తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ తోలు తీశారని ఎద్దేవా చేశారు.
తమ తోలు తీసే అంశాలు ఏవీ ఉన్నా.. అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని కేసీఆర్‌కు చురకలంటించారు. ‘‘ప్రతిపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉన్నది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై కేసీఆర్ మీడియా సమావేశం ఉండాల్సింది. కానీ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉన్నది” అని అన్నారు. 12 ఏండ్లలో తెలంగాణకు ఏం చేశారనే దానిపై కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాయాల్సి ఉండేదని, కానీ.. కేసీఆర్ మెప్పు కోసం సోనియాగాంధీకి కిషన్‌రెడ్డి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే ప్రతిపక్ష పార్టీగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు.
ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలే: మంత్రి జూపల్లి
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కట్టిస్తామని చెప్పిన కేసీఆర్.. పదేండ్లపాటు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను గత కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని, కాలువలు పూర్తి కాకుండానే ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారని విమర్శించారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వని దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా? అని కేసీఆర్ ను జూపల్లి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి, ఏనాడూ తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడలేదని అన్నారు. ‘‘అప్పటి ఏపీ సీఎం జగన్‌తో దోస్తానా చేసిన మీరు.. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకోలేదా?” అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నదని అన్నారు.
మీ తోలు కవిత తీస్తున్నారు: మంత్రి వాకిటి
ఏపీకి కేంద్రం నిధులు తరలిపోతున్నా.. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నా.. కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చూపిన శ్రద్ధ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై ఎందుకు చూపలేదని అడిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే బాగుంటుందని అన్నారు. ‘‘మా తోలు తీస్తామని అనడం కాదు, మీ తోలును కవిత తీస్తున్నారు, ముందు ఆమెపై దృష్టి పెట్టండి” అని కేసీఆర్‌కు చురకలంటించారు.
బీఆర్‌ఎస్‌తో ప్రజలు
ఫుట్‌బాల్ ఆడారు: మంత్రి సీతక్క
కేసీఆర్ తన బిడ్డ కవిత ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తమపై ఎందుకు ఏడుస్తున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజలు పదేండ్లపాటు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చారు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించకపోవడంతో వారిని దించి మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్‌ను ఫుట్‌బాల్ ఆడారు. ఇక కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడుకోవాలో సీఎం రేవంత్‌రెడ్డికి బాగా తెలుసు. ప్రపంచ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీతోనే ఫుట్‌బాల్ ఆడిన రేవంత్‌కు కేటీఆర్‌తో ఆడడం ఓ లెక్కనా” అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్, హరీశ్ ఫెయిల్: ఎమ్మెల్సీ బల్మూరి
బీఆర్‌ఎస్ పార్టీని నడపడంలో కేటీఆర్, హరీశ్ ఇద్దరూ ఫెయిల్ అవడంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరు లీడర్లు దద్దమ్మలు అనేది కేసీఆర్ గుర్తించారని చెప్పారు. కేటీఆర్, హరీశ్ బాగోతాలను కవిత బయటపెడుతున్నదని, వాటికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు.
