ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సోళ్లు..నీళ్లు, నిధులన్నీ వాళ్లకే ధారపోశారు: మంత్రి ఉత్తమ్

ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్సోళ్లు..నీళ్లు, నిధులన్నీ వాళ్లకే ధారపోశారు: మంత్రి ఉత్తమ్
  •  పాలమూరు ప్రాజెక్టులో 90% పనులు పూర్తయితే 
  • ఒక్క ఎకరాకు నీళ్లెందుకు రాలే?
  • పదేండ్లలో ఎందుకు పాలమూరును పట్టించుకోలే
  • కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని 
  • అన్యాయం చేసింది కేసీఆరే    ఏ ప్రాజెక్టు సందర్శనకైనా 
  • మేం రెడీ.. హరీశ్‌‌‌‌రావు ‘గోబెల్స్‌‌‌‌రావు’గా పేరు మార్చుకో   
  •  కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర నీటి హక్కులను,  ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్లకు తాకట్టు పెట్టింది ముమ్మాటికీ బీఆర్ఎస్సోళ్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మండిపడ్డారు. నీళ్లు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు అన్నీ ఆంధ్రోళ్లకే అప్పగించి, కమీషన్లు దండుకుని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. హరీశ్‌‌‌‌రావు తన పేరును ‘గోబెల్స్‌‌‌‌రావు’ అని మార్చుకుంటే మంచిదని, పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చురకలంటించారు. వారి పాపాలు పండాయని, ఆధారాలతో సహా వారు చేసిన ద్రోహాన్ని బట్టబయలు చేస్తామన్నారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో  మీడియాతో మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చిట్‌‌‌‌చాట్‌‌‌‌ చేశారు. గత పదేండ్లలో  బీఆర్ఎస్ చేసిన ధనయజ్ఞాన్ని, ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందాలను గణాంకాలు, జీవో ప్రతులతో సహా ఆయన బయటపెట్టారు. 


పాలమూరు మాత్రమే కాదు, ఏ ప్రాజెక్టు సందర్శనకైనా తాము సిద్ధమని, కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు దమ్ముంటే రావాలని ఉత్తమ్​సవాల్ విసిరారు. మాట్లాడితే కాంట్రాక్టర్లు అని కేసీఆర్ అంటున్నారని, అసలు కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఎవరో, మొత్తం లెక్కలు తీస్తే అసలు దొంగలు ఎవరో తెలుస్తుందని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  తమ తప్పులను ఒప్పుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు తన అతి తెలివితేటలు కట్టిపెట్టి, వాస్తవాలు మాట్లాడాలని  హితవు పలికారు.

45 టీఎంసీలు గత ఒప్పందమే

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. 2016 సెప్టెంబర్ 21న కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు (సుమారు 37:63 నిష్పత్తి) ఉండేలా అడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హక్ ఒప్పందానికి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని మండిపడ్డారు. నాడు కమీషన్ల కోసం 34 శాతానికి తల ఊపి, తర్వాత 50 శాతం కావాలని దొంగ ఏడుపులు ఏడ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా కావాలని ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశామని తెలిపారు. అలాగే కేఆర్ఎంబీకి రాసిన 45 టీఎంసీల లేఖపై హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు చేస్తున్న రాద్ధాంతం సిగ్గుచేటని, ఇది కొత్తగా తాము సృష్టించింది కాదని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమేనని తేల్చిచెప్పారు. 2022 ఆగస్టు 18న బీఆర్ఎస్ ప్రభుత్వమే జారీ చేసిన జీవో నంబర్​  246 ప్రకారం.. పాలమూరు– -రంగారెడ్డికి కేటాయించిన 90 టీఎంసీలను కేసీఆరే రెండు ముక్కలు చేశారని, 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్ ఆదా కింద, మిగిలిన 45 టీఎంసీలను పోలవరం మళ్లింపు జలాల కింద లెక్కగట్టారని, నాడు వారు చేసిన దాన్ని ఇప్పుడు తమపై రుద్దుతున్నారని మండిపడ్డారు. 

రాయలసీమపై చీకటి ఒప్పందం.. 
టెండర్ల కోసమే వాయిదా!

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్  విషయంలో కేసీఆర్ సర్కారు  ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​రెడ్డి తెలిపారు. ఏపీ సర్కారు 2020 మే 5న జీవో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 203 జారీ చేసి, శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల (35వేల క్యూసెక్కులు) కృష్ణా జలాలను తరలించేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీకారం చుడితే, దీనిపై గత కేసీఆర్ ప్రభుత్వం నామమాత్రపు లేఖలతో సరిపెట్టిందని విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవడానికి 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే, నాటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ ప్రభుత్వం ఆ సమావేశాన్ని ఆగస్టు 20 తర్వాతే పెట్టాలని లేఖ రాసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం పిలిచిన రాయలసీమ లిఫ్ట్ టెండర్ల గడువు 2020 ఆగస్టు 10తో ముగుస్తుందని, ఆ లోపు అపెక్స్ కౌన్సిల్ జరిగితే టెండర్లు ఆగిపోతాయని తెలిసి, ఏపీకి పరోక్షంగా సహకరించేందుకే కేసీఆర్ మీటింగ్ వాయిదా వేయించారని ఆరోపించారు. టెండర్లు పూర్తయ్యేలా చూసి, తెలంగాణ గొంతు కోశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆ పనులను ఆపించామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం కూలింది.. అప్పుల కుప్ప మిగిలింది

తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిందని, ఇది కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. ఐదేండ్లలో ఈ ప్రాజెక్టు నుంచి వాడింది కేవలం 70 టీఎంసీల నీళ్లు మాత్రమేనని, కానీ చేసిన అప్పులు మాత్రం లక్షల కోట్లని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు మేము వచ్చినా తర్వాత కిస్తిలు వడ్డీలు కలిపి 49వేల కోట్లు కట్టినట్లు చెప్పారు. కార్పొరేషన్​ పేరిట 11శాతం పైన వడ్డీతో రూ.96వేల 108 కోట్లు అప్పులు చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారని అన్నారు. ఇక పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని ఉత్తమ్ కొట్టిపారేశారు. 90 శాతం పనులు పూర్తయితే పదేండ్లలో ఒక్క ఎకరాకైనా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని, పాలమూరు జిల్లా ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఇప్పటికీ పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు రాలేదని, అది గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని అడిగారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకే డిండి ప్రాజెక్టుకు, ఎస్ఎల్బీసీకి అనుమతులు ఇవ్వలేదని, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై కోపంతో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుపై కుట్ర చేశారని ఆరోపించారు.