పద్మారావునగర్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు భరోసా కల్పించిందని, దానిని బలహీనపరిచే చర్యలను సహించబోమని నేతలు స్పష్టం చేశారు.
పథకం పేరును మార్చడం ద్వారా గాంధీ పేరును తొలగించడమే కేంద్రం ఉద్దేశ్యమని విమర్శించారు. 2014 నుంచి నిధుల కోతలు విధించి, ఇప్పుడు పేరు మార్చడం ద్వారా రాష్ట్రాలు, స్థానిక సంస్థల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొత్త చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
