- వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటామని వెల్లడి
- గద్వాలలో రెండో రోజు జాగృతి జనంబాట
గద్వాల, వెలుగు: ‘దిల్ తూట్ గయా.. ఘర్ వాపసీ ఉండదు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గద్వాలలో ఆమె సోమవారం రెండో రోజు జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత హోటల్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు తన ఫ్యామిలీ మధ్య మేజర్ ఘటనలు జరిగాయన్నారు.
తాను పార్టీలో ఉన్నప్పుడే తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేశారని.. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడంతో గుండె పగిలిపోయిందన్నారు. దీంతో మళ్లీ పార్టీలో చేరే చాన్స్ ఏమాత్రం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తాము బరిలో ఉంటామన్నారు.
రాష్ట్రంలో డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్నడుస్తున్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి అంతా వాటిపైనే ఉన్నదని విమర్శించారు. తమ ప్రాధాన్యత ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అని సీఎం చెప్పడం అంతా పచ్చి మోసమని కవిత ఆరోపించారు. తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం 65.9 నుంచి 61.1 శాతానికి పడిపోయిందని.. ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటే అని ఆమె ప్రశ్నించారు. ఏమి సాధించారని రైజింగ్ తెలంగాణ సంబురాలు చేసుకుంటున్నారని నిలదీశారు.
గద్వాలలో మహిళల అక్షరాస్యత దారుణంగా ఉందని, కేటీ దొడ్డి మండలంలో 23 శాతమే ఉందన్నారు. ఎస్సెఎస్సీలో మాస్ కాపీయింగ్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని, రాష్ట్రాన్ని బిహార్‌లా మారుస్తారా? అని కవిత ప్రశ్నించారు. ఇంటర్ ఉత్తీర్ణత కూడా బాగా తగ్గి పోయిందన్నారు. గద్వాల జిల్లాలో విద్యారంగ అభివృద్ధి మీద ప్రత్యేకంగా పోకస్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలంపూర్‌లో ఇసుక దందాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
అలంపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టుకుని అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నదని కవిత ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించాలన్నారు. అలంపూర్ హాస్పిటల్ ఓపెన్ చేసినా స్టాఫ్, సామగ్రి లేదని, ఈ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు.
గట్టు లిఫ్ట్ పనులు ఆగిపోయాయని, ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్లు చేయడం లేదని, జూరాల ప్రాజెక్టు సిల్ట్ తొలగించడం లేదన్నారు. ఏపీలో కట్టే గండ్రేవుల ప్రాజెక్టుతో తెలంగాణలోని 24 గ్రామాలు ముంపునకు గురయ్యే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రా ప్రాజెక్టులకు తెలంగాణలోని ఇంచ్ భూమి ఇవ్వకుండా ఫైట్ చేస్తామన్నారు. అంతకుముందు ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఫస్ట్ పేజ్ సంపద పంప్ హౌస్‌ను, నెట్టెంపాడు లిఫ్టును, గట్టు లిఫ్ట్ పనులను ఆమె కవిత పరిశీలించారు. గుడ్డేమ్ దొడ్డి దగ్గర కేజీబీవీ స్కూల్ స్టూడెంట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గద్వాల్ లో సీడ్ పత్తి రైతులలో మీటింగ్ నిర్వహించి ఆలంపూర్ కి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు.
