మార్చి 10లోగా చేప పిల్లల బిల్లులు చెల్లించాల్సిందే.. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు  

మార్చి 10లోగా చేప పిల్లల బిల్లులు చెల్లించాల్సిందే.. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు  

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10లోగా చేప పిల్లలను సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2023-–24లో చేప పిల్లల బిల్లుల చెల్లింపులపై దాఖలైన పిటిషన్​ను శుక్రవారం జస్టిస్ మాధవీదేవి విచారించారు. బిల్లులు ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఆ సొమ్మును ఉద్యోగుల జీతాలకు వినియోగించామని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా నిధులను మళ్లించడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, కేసులో మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తరఫు న్యాయవాది కోరారు. ఈసారి మినహాయింపు ఇస్తున్నామని, ఈ నెల 10లోగా చేప పిల్లల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. గడువులోగా బిల్లులు చెల్లించకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.