హైదరాబాద్, వెలుగు: రైల్వే కార్యకలాపాల నిర్వహణపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అదనపు జీఎం సత్య ప్రకాశ్‌తో సహా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు కూడా పాల్గొన్నారు.
రైల్వే కార్యకలాపాల భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. భద్రతాచర్యలను బలోపేతం చేయడంతో పాటు పట్టాల వెంట ఉన్న చెట్ల పొదలను తొలగించడం ద్వారా సిగ్నల్ విజిబిలిటీని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జోన్ లోని అన్ని ముఖ్యమైన క్రాసింగ్ లు, పాయింట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలీకమ్యూనికేషన్స్ వంటి వివిధ భద్రతా కార్యాచరణ ప్రణాళికలను కూడా పరిశీలించారు.
