
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ఆక్రమణలను తొలగించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణల తొలగింపులో అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని సూచించింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న షేక్ సైఫుద్దీన్, ప్రైడ్ ఇండియా మాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
లే అవుట్ చూపిన రోడ్డును ఆక్రమించుకుంటూ చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవాలని జూన్ 26న మున్సిపల్ అధికారులకు అమెరికన్ టౌన్ షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతిపత్రం సమర్పించింది. అయితే, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ వినతిపత్రంపై చర్యలు తీసుకునేలా వారిని ఆదేశించాలని కోరుతూ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. మున్సిపాలిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ సమర్పించిన వినతిపత్రం ఆధారంగా చర్యలు చేపట్టి నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ తిరిగి కొనసాగిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ విచారణను వాయిదా వేశారు.