మద్యం పాలసీలో జోక్యానికి నిరాకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

మద్యం పాలసీలో  జోక్యానికి నిరాకరణ.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమని, ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేమంది. 2025–-27కు సంబంధించి మద్యం పాలసీని జీవో 93 ద్వారా ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్‌‌ను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌‌కు చెందిన గడ్డం అనిల్‌‌ కుమార్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిని జస్టిస్‌‌ ఎన్వీ శ్రవణ్‌‌ కుమార్‌‌ సోమవారం విచారించారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తు ఫీజును నాన్‌‌ రీఫండ్‌‌గా రూ.3 లక్షలకు నిర్ణయించిందని, ఇది దరఖాస్తుదారులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. నాన్‌‌ రీఫండబుల్‌‌ అయితే దరఖాస్తు ఫీజు నామమాత్రంగా నిర్ణయించాల్సి ఉందన్నారు. అంతేగాకుండా, దుకాణాలు కేటాయింపుతో పాటు ఫీజుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగించినా దుకాణాలను ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. స్టేకు నిరాకరిస్తూ ఎక్సైజ్‌‌ శాఖకు, కమిషనర్‌‌కు నోటీసులు జారీ చేశారు.