పరీక్షల పారదర్శకతలో ఇంటర్ బోర్డు పనితీరు భేష్

పరీక్షల పారదర్శకతలో  ఇంటర్ బోర్డు పనితీరు భేష్
  • దేశ, విదేశీ ఎడ్యుకేషన్ బోర్డుల ప్రతినిధుల ప్రశంసలు 

హైదరాబాద్, వెలుగు: పరీక్షల పారదర్శకతలో తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు పనితీరు భేష్​ అని దేశ, విదేశీ ఎడ్యుకేషన్ బోర్డుల ప్రతినిధుల ప్రశంసించారు. సిటీలోని హబ్సిగూడ సీఐఎస్​సీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో మూడు రోజులుగా జరుగుతున్న కోబ్సే సమావేశం శుక్రవారం ముగిసింది. దీనిలో పాల్గొన్న వివిధ దేశాలు, రాష్ర్టాల ప్రతినిధులు.. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విజ్ఞప్తితో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోర్డులో ఉన్న స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్​ ను పరిశీలించారు. 

అక్కడి నుంచి సర్కారు కాలేజీల మానిటరింగ్ తీరును ప్రతినిధులు కొనియాడారు. అన్ని కాలేజీలను సీసీటీవీ నెట్ వర్క్​తో అనుసంధానించడం, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్​ఆర్ఎస్) అటెండెన్స్, ఉద్యోగుల సేవలను హెచ్ఆర్ఎంఎస్ ద్వారా నిర్వహించడం వంటి అంశాలను బోర్డు అధికారులు వారికి వివరించారు. పబ్లిక్ పరీక్షలు, ప్రాక్టికల్స్​ను సీసీకెమెరాల పర్యవేక్షణలో నిర్వహించడం ద్వారా పారదర్శకత, నిష్పాక్షికత పెరుగుతాయని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ విధానాలను తమ రాష్ర్టాల బోర్డుల్లోను అమలు చేయాలని ఆకాంక్షించారు. 

బోర్డును సందర్శించిన వారిలో నేపాల్ నేషనల్‌‌ ఎగ్జామినేషన్‌‌ బోర్డు చైర్మన్‌‌ మహాశ్రం శర్మ, మెంబర్ సెక్రటరీ జంగా బహదూర్ ఆర్యల్, భూటాన్‌‌ ఎగ్జామినేషన్‌‌ కౌన్సిల్‌‌ ప్రతినిధులు తుక్టియా బెనిన్, నార్ బహదూర్ రైకా, జమ్మూ కాశ్మీర్ బోర్డు ప్రతినిధులు యాసిర్ హమీద్ సిర్మల్, ఆరిఫ్ జాన్, కర్నాటక పీయూ బోర్డు ప్రతినిధులు డాక్టర్ వైబీ వెంకటేశ్, ఆనంద, అలీగఢ్ జామియా ఉర్దూ బోర్డు ప్రతినిధి షమూన్ రజా నక్వీ, ఏపీ ఇంటర్ బోర్డు ప్రతినిధులు పి. రేఖారాణి, కృష్ణకాంత్, ఎన్ సీఈఆర్టీ ప్రతినిధి అమన్ దీప్ కుమార్ తదితరులు ఉన్నారు.