- పంట కాల్వల మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేశారు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
- రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు నిర్మించాలని డిమాండ్
- ఉద్యమకారులకు సాయం అందే వరకు పోరాటం చేస్తానని వ్యాఖ్య
- తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో జాగృతి జనం బాట
సూర్యాపేట/తుంగతుర్తి/పెన్ పహాడ్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సారెస్పీ కాలువలను పట్టించుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఎస్సారెస్పీ స్టేజ్ టూ లో భాగంగా నల్గొండ జిల్లాకు రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. అర్వపల్లి మండలంలోని కేజీబీవీ, ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ ను గాలికి వదిలేశారని విమర్శించారు. కాల్వల మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదని ఆరోపించారు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే 70 కి.మీ. డిస్ట్రిబ్యూటరీ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదన్నారు.
రుద్రమ దేవి చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉందని.. కానీ, కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదని మండిపడ్డారు. ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని కోరారు. తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి రెండు సార్లు శంకుస్థాపన చేసినా.. పనులు మాత్రం పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ఇక్కడి 30 పడకల హాస్పిటల్‌ను వంద పడకల హాస్పిటల్ గా మారుస్తామని 2018 లో కేసీఆర్ వచ్చి మాట ఇచ్చారని.. కానీ, 2022 వరకు కూడా మోక్షం లేకుండా పోయిందన్నారు. 2022 లో జీవో ఇచ్చి అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు శంకుస్థాపన చేశారని.. ఆ తర్వాత ప్రభుత్వం మారిందన్నారు.
ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వచ్చి మళ్లీ శంకుస్థాపన చేశారని.. అయినా హాస్పిటల్ నిర్మాణం పెండింగ్ లో ఉందన్నారు. వీలైనంత తర్వగా హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతు బంధు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. పిడికిలెత్తి గట్టిగా నిలదీయకపోవటంతోనే ప్రభుత్వం హామీలు విస్మరిస్తోందన్నారు.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జాగృతి ఉంటుంది..
సమస్య ఎక్కడ ఉంటే దాని పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి అక్కడ ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం పెన్ పహాడ్ మండల పరిధి చీదెళ్ల గ్రామం లోని డబల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చినంక అన్ని కష్టాలు పోతాయి అనుకుంటే 12 ఏండ్లకు కూడా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దత్తత తీసుకున్న గ్రామం చీదెళ్లకు కనీసం రోడ్డు పడకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు. ఇక్కడ గత పాలకుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనబడుతుందని అన్నారు. ఈ గ్రామ సమస్యల పట్ల తాను, స్థానిక జాగృతి నాయకులు పోరాటం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారని కవిత అన్నారు. ఉద్యమ సమయంలో 12 వందల మంది అమరులయ్యారని చెప్పారని.. కానీ, వారందరికీ సాయం చేయలేదన్నారు. అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ. 25 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూమి ఇచ్చే వరకు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని మేమే ఆక్రమించి ఉద్యమకారులకు పట్టా రాసి ఇస్తున్నామని ప్రకటించారు.
ఆర్వపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్ లో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రూ. 50 కోట్లు వెచ్చించి నిర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిరుపయోగంగా మారిందన్నారు. లోప భూయిష్టంగా ఉన్న మార్కెట్ ను సరిచేసి వ్యాపారులు, రైతులకు అందుబాటులోకి తేవాలని కోరారు.
