తెలంగాణలో మరో రెండు మండలాలు ఏర్పాటు

తెలంగాణలో మరో రెండు మండలాలు ఏర్పాటు

తెలంగాణలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఓ గ్రామ పంచాయితీని మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  మాడ్గుల్‌ మండలం నుంచి 9 గ్రామాలతో ఇర్విన్‌ మండలంగా ఏర్పాటు చేస్తూ  రెవెన్యూశాఖ జూన్ 28వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే 10 రోజుల్లో సమర్పించాలని అక్కడి ప్రజలకు సూచించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు, 12 మున్సిపాలిటీలు, మూడు నగరపాలక సంస్థలున్నాయి. ఇర్విన్‌ మండల ఏర్పాటుతో మండలాల సంఖ్య 28కి చేరనుంది. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరిని  మండలంగా  ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ జూన్ 28వ తేదీ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు 2023 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత అక్కడి  ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించి.. వాటిని పరిశీలించింది. ఇవాళ (జూలై 28న) తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  కొత్త మండలం ఏర్పాటుతో మండలాల సంఖ్య 12కు చేరింది. 

హనుమకొండ జిల్లాలోని రెండు గ్రామాల బదలాయింపునకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేసింది. అలాగే వేలేరు మండలం ఎర్రబల్లె గ్రామాన్ని అదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలానికి బదలాయించింది. అభ్యంతరాలు, వినతులకు 15  రోజుల గడువు ఇస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.