న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఫిర్యాదుదారునికి రూ.1.5 కోట్లు చెల్లించడంతో కోర్టు ఆయనకు విధించిన శిక్షను నిలిపివేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రాజ్‌పాల్ యాదవ్ తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, ముందస్తు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని ఆదేశించింది. మార్చి 18న జరిగే విచారణకు భౌతికంగా లేదా వర్చువల్ పద్ధతిలో హాజరు కావాలని ఆదేశించింది.
బెయిల్ రావడంతో ఆయన మంగళవారం బయటకు వచ్చారు. జైలు బయట విలేకర్లతో మాట్లాడారు. ‘‘నేను 2027నాటికి బాలీవుడ్‌లో అడుగుపెట్టి 30 ఏండ్లు పూర్తవుతాయి. ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. అందుకే 200 నుంచి 250 సినిమాల్లో నేను నటించా. నేను హైకోర్టు ఆదేశాలను ఎల్లప్పుడూ పాటించా. భవిష్యత్తులోనూ పాటిస్తా. అవసరమైనప్పుడు
అందుబాటులో ఉంటా. నాపై వచ్చిన ఆరోపణలకు పూర్తి పారదర్శకతతో సమాధానం చెప్పడానికి నేను సిద్ధం” అని చెప్పారు.
