కానిస్టేబుళ్లకు ఓపెన్‌‌‌‌ డిగ్రీ

 కానిస్టేబుళ్లకు ఓపెన్‌‌‌‌ డిగ్రీ
  • అంబేద్కర్​ ఓపెన్ యూనివర్సిటీతో ఎంఓయూ
  • డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 35 వేల మంది కానిస్టేబుళ్లకు డిగ్రీ లేనట్టు గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నుంచి అధికారి స్థాయి వరకు వృత్తిలో నైపుణ్యం అవసరమని డీజీపీ జితేందర్ అన్నారు. ప్రస్తుత సైబర్ క్రైమ్ సహా పోలీసింగ్‌‌‌‌లో అన్ని టెక్నికల్ స్కిల్స్‌‌‌‌ ఉండాలని సూచించారు. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 35 వేల మంది కానిస్టేబుల్స్‌‌‌‌కు  గ్రాడ్యుయేషన్‌‌‌‌ లేదని తెలిపారు.  దీంతో10 వ తరగతి, ఇంటర్ విద్యార్హతలతో పనిచేస్తున్న కానిస్టేబుల్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్(ఏఎస్‌‌‌‌ఐ) స్థాయి అధికారులకు డిగ్రీ పూర్తి చేసే అవకాశం కలిపిస్తున్నామని చెప్పారు.

 ఈ మేరకు డాక్టర్‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ యూనివర్సిటీతో గురువారం ఎంఓయూ చేసుకున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ‌‌‌‌ గంటా చక్రపాణితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్‌‌‌‌, ఏఎస్​ఐలకు ఓపెన్ డిగ్రీ ద్వారా నైపుణ్యం పెంపొందిస్తామన్నారు. వారు విధులు నిర్వహిస్తూనే డిగ్రీ పూర్తి చేయవచ్చని చెప్పారు. మొదటి దశలో 40 ఏండ్ల లోపు వారికి అడ్మిషన్‌‌‌‌ కల్పిస్తామన్నారు. వీసీ‌‌‌‌ చక్రపాణి మాట్లాడుతూ.. పోలీసుల ఓపెన్ డిగ్రీ కోసం ప్రత్యేక కోర్సులు తయారు చేసినట్టు తెలిపారు. దాదాపు 120 సబ్జెక్టులను పరిశీలించామని, అందులో ప్రజాసేవలో ఉండే పోలీసులకు అవసరమైన అంశాలతో కూడిన సబ్జెక్టులను రూపొందించామని తెలిపారు. 

పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు దగ్గర్నుంచి, ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ సైన్స్‌‌‌‌, పబ్లిక్ రిలేషన్‌‌‌‌, మీడియా, సోషల్‌‌‌‌ మీడియా సహా ప్రస్తుత కేసుల దర్యాప్తునకు అవసరమైన అంశాలతో కూడిన గ్రాడ్యుయేషన్‌‌‌‌ కోర్సులు అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌, తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్‌‌‌‌ డీజీ వీవీ శ్రీనివాసరావు, సీఐడీ చీఫ్‌‌‌‌ చారుసిన్హా సహా పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.