ఆకాంక్షను అర్పిత్ ఎందుకు చంపాడు..వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది.?

ఆకాంక్షను అర్పిత్ ఎందుకు చంపాడు..వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది.?

బెంగళూరులో  తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్  ఉద్యోగిని  ఆకాంక్ష ( 23)హత్యకు గురైంది. జూన్ 6న  ఆమె రూమ్‌మేట్ అపార్ట్‌మెంట్‌కు తిరిగి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఘటనా స్థలానికి వచ్చిన  బెంగళూరులోని జీవన్ భీమా నగర్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అర్పిత్‌గా గుర్తించారు.  అర్పిత్ గ్లోబల్ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్‌లో పనిచేస్తున్నాడని..అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

నాలుగేళ్ల క్రితం బైజూస్‌లో పనిచేస్తున్నప్పుడు ఆకాంక్ష, అర్పిత్‌లు కలిశారని పోలీసులు తెలిపారు.. అర్పిత్, ఆకాంక్ష చాలా రోజులు  సహజీవనం చేశారని చెప్పారు. ఇటీవలే  వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారని.. దీనికి అర్పిత్ ఒప్పుకోకపోవడంతో  కొన్ని రోజుల నుంచి  ఇద్దరి మధ్య   గొడవ  జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

జూన్ 5న  బెంగళూరులోని ఆకాంక్ష ఫ్లాట్ కు వెళ్లిన అర్పిత్ కు ఆకాంక్షకు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్పిత్ ఆకాంక్షను చున్నితో  గొంతు నులిమి  చంపాడని.. ఆత్మహత్యగా చూపించే ప్రయత్నంలో అర్పిత్ ఆమె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసేందుకు ప్రయత్నించాడని  తెలిపారు. తన ప్రయత్నంలో విఫలమవడంతో అర్పిత్ ఆకాంక్ష మృతదేహాన్ని  నేలపై  వదిలి.. అపార్ట్‌మెంట్ తలుపుకు తాళం వేసి  సంఘటనా స్థలం నుండి పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. అర్పిత్ ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (ఈస్ట్) ఎం చంద్ర శేఖర్ తెలిపారు.