తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసి పది రోజులు అవుతున్నా భక్తుల రాక మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసిన అనంతరం గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, చీర, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఊరట్టం క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం నుంచి గద్దెల వరకు వాహనాల రద్దీ నెలకొంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల దర్శనానికి గంటల కొద్దీ వేచి ఉండాల్సి రావడంతో క్యూలైన్‌లో వచ్చిన భక్తులు, చిన్న పిల్లలకు అవస్థలు పడాల్సి వచ్చింది. ఓ వైపు ఎండ.. మరో వైపు తాగునీరు లేకపోవడంతో కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలని పూజారులు సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారులు కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలతో కలిసి వనభోజనాలకు వెళ్లారు.
రూ.10 కోట్లు దాటిన మేడారం హుండీ ఆదాయం
వరంగల్, వెలుగు : మేడారం జాతర సమయంలో ఏర్పాటు చేసిన హుండీల ఆదాయం రూ.10 కోట్లు దాటింది. హనుమకొండలోని టీటీటీ కల్యాణ మండపంలో జరుగుతున్న లెక్కింపులో నాలుగోరోజైన ఆదివారం 200 హుండీలను తెరిచారు. వీటి ద్వారా మొత్తం రూ.2,64,75,757 ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు మొత్తం 625 హుండీలను ఓపెన్ చేయగా మొత్తం ఆదాయం రూ.10,71,22,116 వచ్చింది. ఇంకా 203 హుండీలను ఓపెన్ చేయాల్సి ఉంది.
కిటకిటలాడిన యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ప్రధానాలయ ప్రాంగణంతో పాటు లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం, బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
