- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసిందని, మున్సిపాలిటీలకు రూ.3,600 కోట్లు బకాయిలు పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ ఆరోపించారు. ఆ లోటును పూడ్చుకోవడానికి, తమ అప్పులు తీర్చుకోవడానికి ప్రజలపై పన్నుల భారం మోపడమే టార్గెట్‌గా మున్సిపల్ ఎన్నికలకు ఆ పార్టీ వెళ్తున్నదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాటర్ ట్యాక్స్, కరెంట్ చార్జీలు, ఆస్తి పన్నులు పెంచి జనం నడ్డి విరుస్తారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్‌లతో వేధిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నేరుగా రౌడీయిజం చేస్తున్నదని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లి, మాస్ రిగ్గింగ్ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని.. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు ఇప్పటికే ఉన్న 4శాతం రిజర్వేషన్లకు తోడు, వారిని బీసీల్లో చేర్చి మరో 10% కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నదని, సర్వేలన్ని కమలానికే జై కొడుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 1,900 సీట్లలో బీజేపీ గెలుపు ఖాయమని, మరో 600 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నామని
పేర్కొన్నారు.
