- ఎన్నికల ముందే చైర్‌పర్సన్‌లను ప్రకటిస్తున్న ప్రధాన పార్టీలు
- చైర్‌పర్సన్ పదవి పై ఆశతో భారీగా ఖర్చు పెడుతున్న అభ్యర్థులు
నల్గొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్‌పర్సన్ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. నల్గొండ కార్పొరేషర్ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి బుర్రి స్రవంతిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా ప్రకటించగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
ఈ రెండు చోట్ల మినహా అధికారికంగా ఎక్కడా చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన పార్టీలు చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలో దిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్ సీటుపై ఆశతో ఆశావహులు భారీగా ఖర్చు పెడుతున్నారు. తన గెలుపుతో పాటు తన పార్టీకి చెందిన వార్డు సభ్యుల గెలుపును కూడా వారి భుజాలపై వేసుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇన్నీ చేసినా చివరికి పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయా..? తానే పార్టీ అభ్యర్థిని అవుతానా అనే టెన్షన్‌లో ఆశావహులు ఉన్నారు.
చైర్‌పర్సన్ సీటుపై గంపెడాశలు
నల్గొండ, సూర్యాపేట మినహా ఎవరికి వారే తామే చైర్‌పర్సన్ అభ్యర్థులుగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది ఆశావహులకు పార్టీ పెద్దలు అంతర్గతంగా మాట ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నుంచి గుడిపాటి శిరీష--, నూకల కవిత వేణుగోపాల్, షాగా జయలక్ష్మీ జలే౦ధర్, చిలుకూరు సుధా బాలు చైర్‌పర్సన్ సీటు కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కానీ అధికారికంగా ప్రకటించకపోవటంతో ఉత్కంఠ నెలకొంది. అలాగే బీఆర్‌ఎస్ నుంచి పద్మశెట్టి లక్ష్మీ కోటేశ్వరరావు చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్‌పర్సన్ రేసులో చింతల చంద్రా రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి ఉండగా, బీఆర్‌ఎస్ నుంచి నల్గొండ సుధాకర్ పోటీ పడుతున్నారు. నందికొండ మున్సిపల్ కాంగ్రెస్ చైర్మన్‌గా మానస స్వర్ణ పేరును దాదాపు ఖరారు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి ఎర్ర మంజుశ్రీ, చిట్యాల మున్సిపల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పందిరి గీతా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అలాగే మిగతా మున్సీపాలిటీల్లో కూడా ఎక్కడ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవటంతో ఉత్కంఠ నెలకొంది. సూర్యాపేట జిల్లాలో కోదాడ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎర్నేని కుసుమ బాబు, దేవరపల్లి మల్లీశ్వరి, గుండపనేని పద్మావతితో పాటు పలువురు నేతలు చైర్‌పర్సన్ సీటు ఆశలతో బరిలో దిగారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ నుంచి దొంతగాని శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ రావు పేర్లు వినిపిస్తుండగా, బీఆర్‌ఎస్ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.
