- బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ఆ పార్టీ వారే కిడ్నాప్‌చేశారని కుటుంబ సభ్యుల ఆందోళన
- మున్సిపల్ ఆఫీసుపై రాళ్లు రువ్విన దుండగులు
- చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసిన అధికారులు
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టెన్షన్ నెలకొన్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్ సమావేశానికి రాకపోవడంతో అతడిని కిడ్నాప్ చేశారంటూ కొందరు వ్యక్తులు ఆఫీసుపై రాళ్లు రువ్వారు. కిడ్నాప్‌కు గురయ్యాడని చెబుతున్న వార్డు మెంబర్కుటుంసభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్ఆఫీసర్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులుండగా.. 13 బీఆర్ఎస్ -, 8 కాంగ్రెస్-, 2 బీజేపీ-, ఒక ఇండిపెండెంట్- గెలిచారు.
బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చినా ఒక బీజేపీ, ఒక ఇండిపెండెంట్అభ్యర్థిని తీసుకొని క్యాంపు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సైతం వారు గెలిచిన 8 మందితోపాటు ఒక బీజేపీ అభ్యర్థితో క్యాంప్ పెట్టింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్బలం 10కి చేరింది. అయితే, 19 వార్డు బీఆర్ఎస్ మెంబర్ఆకుల యాదగిరి, 3వ వార్డు నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణను కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ సభ్యుడి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
సోమవారం ఉదయం ఉదయం 11 గంటలలోపే మున్సిపల్ ఆఫీసుకు 8 మంది కాంగ్రెస్, ఒక బీజేపీ- కౌన్సిలర్‌తోపాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే(ఎక్స్ అఫీషియో సభ్యుడు) మల్ రెడ్డి రంగారెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మినహా మిగిలిన 12 మంది, ఒక బీజేపీ, ఒక ఇండిపెండెంట్- కలిపి 14 మంది వచ్చారు. ఆకుల యాదగిరిని బీఆర్ఎస్ వారే క్యాంపునకు తరలించి కిడ్నాప్ చేశారని.. అతను వచ్చేవరకు ఎన్నిక ఆపాలని మున్సిపల్ ఆఫీసు వద్ద అతడి కుటంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ గందరగోళ వాతావరణంలోనే 23 మంది కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. అనంతరం12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ప్రకటించారు.
అయితే, కిడ్నాపైన సభ్యుడు వచ్చేవరకు ఆగాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన తెలుపడంతో ఎన్నికను ప్రిసైడింగ్ ఆఫీసర్ మరో అరగంట వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడం, కొందరు దుండగులు ఆఫీసుపైకి రాళ్లు రువ్వడంతో మున్సిపల్ కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో కౌన్సిలర్లు కూడా మళ్లీ క్యాంపునకు తరలివెళ్లారు. అయితే, కాంగ్రెస్ కు ఎక్స్అఫీషియోతో కలిపి 10 మంది సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న ముగ్గురు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
