- టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లలో క్రిటికల్ థింకింగ్, ప్రశ్నించే తత్వం పెంచేందుకే ఈసారి గ్లోబల్ థింకర్స్తో క్యాలెండర్ డిజైన్ చేశామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఇన్నోవేటివ్ ప్రయత్నమని వివరించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని టీజీసీహెచ్ఈ ఆఫీసులో 2026 ఏడాది డైరీ, క్యాలెండర్ -కం-ప్లానర్‌ను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గతేడాది సావిత్రీబాయి పూలే, అబ్దుల్ కలాం, జాకీర్ హుస్సేన్ వంటి భారతీయ దిగ్గజాలతో శాస్త్రీయ దృక్పథాన్ని చాటామని గుర్తు చేశారు.
అయితే, ఈసారి విద్యా వ్యాప్తిలో, ప్రభుత్వ సంస్థల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ మేధావులను ఎంచుకున్నామన్నారు. తరగతి గదుల్లో ప్రజాస్వామ్యం, అనుభవపూర్వక అభ్యాసం, విద్యార్థి కేంద్రిత విధానాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెక్నాలజీ, గ్లోబల్ సిటిజన్‌షిప్, సమానత్వం కోసం పాటుపడిన వీరందరి స్ఫూర్తి విద్యార్థులకు అవసరమని బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
